తిరువనంతపురం: ఓ యువకుడు అతి తెలివి ప్రదర్శించాడు. తన తలకు విగ్ ధరించి అందులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కేరళ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. నౌషద్ అనే యువకుడు.. షార్జా నుంచి కేరళ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ముందుగా తన తలపై మధ్యభాగంలో వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఆ భాగంలో బంగారం పెట్టి.. దానిపై జుట్టు అధికంగా ఉన్న విగ్‌ను ధరించాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. నౌషద్ పట్టుబడ్డాడు. విగ్లో ఉన్న 1.13 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నౌషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
