Breaking News
Home / States / Andhra Pradesh / పోలవరానికి 16 వేల కోట్లు అడ్వాన్సుగా ఇవ్వండి

పోలవరానికి 16 వేల కోట్లు అడ్వాన్సుగా ఇవ్వండి

రివర్స్‌ టెండరింగ్‌తో 838 కోట్లు ఆదా!
తుది అంచనాలను వెంటనే ఆమోదించండి
రెవెన్యూ లోటు కింద 19 వేల కోట్లివ్వండి
గోదావరి ఎత్తిపోతలపై ఆదేశాలివ్వండి
‘విభజన’ సమస్యలు పరిష్కరించాలి
నవరత్నాలకు చేయూతనివ్వండి: సీఎం
ప్రధానికి సీఎం జగన్‌ వినతి
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు ముందస్తుగా రూ.16 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ అభ్యర్థించారు. శనివారమిక్కడ ప్రధానితో ఆయన నివాసంలో సమావేశమైన సీఎం.. గంటసేపు ఆయనతో చర్చలు జరిపారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, ఆ ప్రాజెక్టుకు సాయం, పీపీఏల రద్దు, రెవెన్యూ లోటు భర్తీ, నవరత్నాలకు సాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, విభజన హామీల అమలు, గోదావరి-కృష్ణా అనుసంధానానికి సాయం మొదలైన అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. ‘పోలవరం సవరించిన అంచనాల మొత్తం రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలి. ఇందులో భూ సేకరణ, పునరావాసానికే రూ.30 వేల కోట్లకుపైగా వ్యయమవుతాయి. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,103 కోట్లు ఖర్చు చేసింది. దీనిని రీయింబర్స్‌ చేయాలి. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ముందస్తుగా రూ.16 వేల కోట్లు విడుదల చేయాలి. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశాం. ఇందులో హెడ్‌ వర్క్స్‌, విద్యుత్కేంద్రం పనులకు సంబంధించి రూ.780 కోట్లు, టన్నెల్‌కు సంబంధించి రూ.58 కోట్లు ఆదా అయ్యాయి’ అని పేర్కొన్నారు. సంబంధిత డాక్యుమెంట్లను ప్రధానికి జగన్‌ సమర్పించారు. ఇంకా ఏమేం కోరారంటే..

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 5,739 కోట్లే..
కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61071.51 కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పేర్కొంది. ఈ ఏడాది 2019-20లో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయిలో బడ్జెట్‌లోనూ ఇదే పేర్కొన్నాం. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ.5739 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50000 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడండి. అందుకే గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ కింద వీటికి అదనంగా మరో రూ.40,000 కోట్లు మంజూరు చేయాలి. 2014-15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవెన్యూ లోటు రూ.22,928.76 కోట్లుగా కాగ్‌ అంచనా వేస్తే అందులో రూ. 3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి. ఇంకా రూ.18,969.26 కోట్లు రావాలి. వీటిని వెంటనే విడుదల చేయాలి.

వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ..
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేబీకే తరహా ప్యాకేజీ ప్రకటించాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఆరేళ్లలో రూ.2,100 కోట్లు రావలసి ఉంది. ఇప్పటివరకూ రూ.1050 కోట్లే వచ్చాయి.

నదుల అనుసంధానానికి ఊతమివ్వండి..
కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాలో నీటి కొరతను అధిగమించవచ్చు. సాగును స్థిరీకరించవచ్చు. రాయలసీమకు సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయరులో నీటి లభ్యత 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు ధవళేశ్వరం వద్ద 2,780 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. గోదావరి నీటిని నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయవడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతో పాటు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు సమృద్ధిగా లభించి, ఆర్థికంగా ఆ ప్రాంతం పురోగమించడానికి దోహదపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలు మలుపు తిప్పే గొప్ప ప్రాజెక్టు అవుతుంది. ఈ ప్రాజెక్టుపై సంబంధిత మంత్రులకు తగిన ఆదేశాలివ్వాలి.

ఇవన్నీ చేపట్టాలి..
విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాలి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను చేపట్టాలి. ఇవి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహపడతాయి. సకాలంలో ఇవి పూర్తయ్యేలా సంబంధిత శాఖలను ఆదేశించాలి.

నవరత్నాలతో నూతన శకం..
మా ఎన్నికల హామీలైన నవరత్నాలకు చేయూతనివ్వండి. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సమగ్ర అభివృద్ధికి ఇవి నూతన శకానికి నాంది పలికాయి. రైతుల కోసం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టాం. అందరికీ విద్యను అందించేందుకు అమ్మ ఒడి, అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ, మహిళా సాధికారత కోసం ఆసరా, నిరాదరణకు గురవుతున్న వర్గాల కోసం చేయూత ..ఇవన్నీ అమలు చేస్తున్నాం. ఇవన్నీ జాతీయ స్థాయిలో అమలు చేయదగ్గవే. కాబట్టి వీటిని రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని కోరుతున్నాం. సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించండి.

ప్రత్యేక హోదా ఇవ్వండి
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. దీని ఆవశ్యకత గురించి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాం. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ముఖ్యంగా పరిశ్రమలు, సేవా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తద్వారా రాష్ట్ర స్థూలాదాయం పడిపోయింది. గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ)లో వీటి వాటా 76.2 నుంచి 68.2 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితి మారాలంటే పరిశ్రమలు, సేవారంగాలు పురోగమించాలి. అందుకే ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి హోదా నిధులతో రాష్ట్రాన్ని ఆదుకోవాలి. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే.. పెట్టుబడిదారులు సహజంగానే మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు వైపు చూస్తారు.

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *