Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులు

ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులు

ఆస్పత్రి బిల్లు రూ.వెయ్యి దాటితే వర్తింపు
రూపాయి ఖర్చులేకుండా కంటివైద్యం
రెటినోపతికీ ఉచితంగా చికిత్సలు
మూడేళ్లలో 5 కోట్ల మందికి పరీక్షలు
అవసరమైతే ఉచితంగా కళ్లద్దాలు
డయాలసిస్‌, తలసేమియా రోగులకు జనవరి 1 నుంచి 10 వేల పెన్షన్‌
పక్షవాత రోగులకు ఐదేసి వేలిస్తాం
మరో 4 రకాల వ్యాధిగ్రస్తులకూ..
కొత్తగా 5 చోట్ల వైద్య కళాశాలలు
ఏలూరు, పులివెందుల, పిడుగురాళ్ల, మార్కాపురం, పాడేరుల్లో ఏర్పాటు
ప్రభుత్వాస్పత్రుల సమూల ప్రక్షాళన
రాష్ట్ర ప్రజలకు సీఎం ఆరోగ్య వరాలు
‘వైఎస్‌ఆర్‌ కంటివెలుగు’కు శ్రీకారం
నేను అనంతపురం మనవడిని. మా తల్లి విజయమ్మది ఇదే జిల్లా. ఈ జిల్లా మనవడిగా అనంతపురం రుణం తీర్చుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తా. నా తండ్రి కలలుకన్న హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ సామర్థ్యం పెంచుతా!
జగన్‌

అనంతపురం: ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటిన అర్హులందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. రెండు వేల వ్యాధులను దీని పరిధిలోకి తెస్తామని వెల్లడించారు. గురువారం అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో వైఎ్‌సఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య వరాల వర్షం కురిపించారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశాయన్నారు. అందుకే తాము ప్రజల కంటి సమస్యల కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు చేయకుండా పథకాన్ని రూపొందించామని. ఇందుకోసం రూ.560 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై తమ ప్రభుత్వం ప్రధాన దృష్టి సారిస్తోందన్నారు.

‘రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి ఆరు దశల్లో కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తాం. కంటి సమస్యలు పట్టించుకోకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదముంది. ఆ సమస్యపై ధ్యాస పెడితే 80 శాతం కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్‌ రోగులకు వచ్చే రెటినోపతి లాంటి వాటికి కూడా ఉచితంగా చికిత్సలు అందిస్తాం. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ప్రతి ఇంట్లో వెలుగు.. ప్రతి కంటికీ వెలుగు మా నినాదం’ అని చెప్పారు.

మొదటి, రెండు దశల్లో పిల్లలకే..
‘ప్రస్తుతం రాష్ట్ర జనాభా 5.40 కోట్లుంటే అందులో 2.12 కోట్ల మందికి కంటిచూపు సమస్యలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరికీ కంటి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఒకేసారి అందరికీ చేయడం సాధ్యం కాదు. ఆరు దశల్లో పూర్తి చేస్తాం. మొదటి, రెండు దశల్లో పిల్లలకు మాత్రమే కంటి పరీక్షలు నిర్వహిస్తాం. అక్టోబరు 10 నుంచే రాష్ట్రంలోని 62,480 పాఠశాలల్లోని 70,41,940 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సంబంధిత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగాలి’ అని సీఎం పిలుపిచ్చారు. విద్యార్థులకు రెండో దశ కంటి పరీక్షలు నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకూ పూర్తి చేస్తాం. తక్కిన నాలుగు దశల్లో రాష్ట్రంలోని అన్ని వయసుల వారికీ 2020 ఫిబ్రవరి 1 నుంచీ 2022 జనవరి 31 లోపు కంటిపరీక్షలు, చికిత్సలు పూర్తి చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తాం. అందరూ తమ పిల్లలకు కంటి పరీక్షలు చేయించి తామూ చేయించుకోవాలి’ అని కోరారు.

108 వ్యవస్థ సమూల మార్పు..
రాష్ట్రంలో 108 ద్వారా వైద్యసాయం అందిస్తున్న వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆపదలో కాల్‌ చేసిన వారికి కుయ్‌..కుయ్‌..కుయ్‌ మంటూ రయ్‌రయ్‌న వచ్చే 108 వాహనాలు ప్రస్తుతం దీనావస్థలో ఉన్నాయన్నారు. అవి బ్రహ్మాండంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, కొత్తగా 432 వాహనాలను కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. 104 ద్వారా వైద్యసేవలందించే వాహనాల పరిస్థితి కూడా బాగా లేదన్నారు. వాటిని కూడా కొత్తగా 1100 వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. వీటన్నిటినీ వచ్చే మార్చిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. పలాస, మార్కాపురంలో కిడ్నీరోగులు పెరుగుతున్నారని.. ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని.. అక్కడ కిడ్నీ వ్యాధినిరోధక ఆస్పత్రులతోపాటు పరీక్షా కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు.

‘రాష్ట్రంలో పిడుగురాళ్ల, మార్కాపురం, ఏలూరు, పాడేరు, పులివెందులలో కొత్తగా మెడికల్‌ కళాశాలలు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ఏలూరులో శంకుస్థాపన చేశాం. డిసెంబరు 1 నుంచీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులిస్తాం. ఆ కార్డులోనే సంబంధిత నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వివరాలతోపాటు వైద్యసేవల వివరాలుండే డేటా స్టోరేజీ కూడా పొందుపరుస్తాం. ప్రస్తుతం 1200 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. జనవరి 1 నుంచి దాన్ని 2000 రోగాలకు పెంచి ఇతర రాష్ర్టాల్లో గుర్తించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలందించడానికి కృషి చేస్తాం. మొదటగా పశ్చిమగోదావరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మూడు నెలలు సేవలందిస్తాం. తర్వాత క్రమంగా నెలకొక జిల్లా చొప్పున అందులో చేరుస్తాం’ అని తెలిపారు.

జనవరి 1 నుంచి సాయం..
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం డయాలసిస్‌, తలసేమియా రోగులకు నెలకు రూ.10 వేల ప్రకారం పెన్షన్‌ వచ్చే జనవరి 1 నుంచీ అందిస్తామని సీఎం చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పని అంశంగా పక్షవాతంతోపాటు మరో క్లిష్టమైన నాలుగు రోగాల వారికి కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.5 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల తర్వాత డాక్టర్లు రోగులను విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తారని.. వారు సూచించిన కాలానికి కాలానికి నెలకు రూ.5వేల చొప్పున భృతి కింద అందిస్తామన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.650 కోట్ల బకాయిలున్నాయని, వాటిలో రూ.520 కోట్లు చెల్లించామని.. మిగతా మొత్తం దశల వారీగా పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సేవలు, చికిత్సలు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుని రోగులను చిరునవ్వుతో ఆస్పత్రులకు ఆహ్వానించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సంస్కరిస్తామన్నారు. నాడు.. నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వాస్పత్రినీ ఆధునికీకరించి అప్పుడు.. ఇప్పుడు ఫోటోలతో అందరికీ ఆందుబాటులో ఉంచుతామని చెప్పారు. అనంతపురం, గుంటూరు ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసని.. వాటిని సమూలంగా మారుస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి జూన్‌ 22 వరకూ ప్రభుత్వాస్పత్రుల్లో మార్పు తెచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

అనంతపురం మనవడిని..
తాను అనంతపురం మనవడినని, తన తల్లి విజయమ్మది ఇదే జిల్లా అని జగన్‌ చెప్పారు. మనవడిగా అనంతపురం రుణం తీర్చుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తన తండ్రి కలలుకన్న హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ సామర్థ్యం పెంచుతామన్నారు. ఇప్పుడు కేవలం 2,200 క్యూసెక్యుల సామర్థ్యముండే కాలువే ఉందని.. దాన్ని 6 వేల క్యూసెక్యులకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. దానికి సమాంతరంగా 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో కాలువ తవ్వుతామని చెప్పారు. మనవడి పాలనతో, తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడి చెరువులు నిండాయన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *