న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఒక బంగారం వ్యాపారికి చెందిన దుకాణంలోని 25.7 కిలోల బంగారం మాయమైంది. దుకాణంలో పనిచేసే వ్యక్తి నగలను తీసుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ బంగారు నగలను దోచుకుని వెళ్లిన వ్యక్తి తరచూ తన లొకేషన్ మారుస్తూ వచ్చాడు. చివరికి రాజస్థాన్‌లో దొరికిపోయాడు. అతని నుంచి పోలీసులు 600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బంగారం వ్యాపారి చాందీనీ చౌక్‌లో దుకాణం నిర్వహిస్తున్నాడు.
అతను తన వ్యాపార నిర్వహణకు సోనీ అనే యువకుడిని 2017లో ఇన్‌ఛార్జ్‌గా నియమించుకున్నాడు. అయితే ఆదాయ వ్యయాల్లో తేడాలు రావడంతో వ్యాపారికి ఆ ఇన్ఛార్జ్ మీద అనుమానం కలిగింది. ఈ నేపధ్యంలోనే షోరూంలోని 25.7 కిలోల బంగారం మాయమైంది. దీంతో ఆ వ్యాపారి ఇన్ఛార్జిపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనీ కోసం వెదుకులాట ప్రారంభించారు. అతని మొబైల్ ఫోను ఆధారంగా రాజస్థాన్‌లో నిందితుడిని పట్టుకున్నారు. అతనికి సహకరించిన సచిన్ అనే యువకుడిని కూడా అరెస్టు చేశారు.