విజయవాడ: జిల్లాలో జులై 8వ తేదీన 3,14,608 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. నగరంలోని తమ విడిది కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల నిమిత్తం మొత్తం 5811 ఎకరాల భూమిని సేకరించినట్టు చెప్పారు. వాటిలో 2384 ఎకరాలు ప్రభుత్వ భూమికాగా, మిగతా 3427 ఎకరాలు పట్టా భూమి సేకరించామన్నారు. మొత్తం 1477 లేఅవుట్లను సిద్ధం చేయగా, వాటిలో ప్రభుత్వ భూముల్లో 910 లేఅవుట్లు, సేకరించిన భూముల్లో 567 లేఅవుట్లు అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, డ్వామా, రెవెన్యూ శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
