Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కుప్పకూలిన 30 లక్షల జీవితాలు.. మేస్త్రీలు, కూలీలకు నష్టం 12 వేల కోట్ల పైనే!

కుప్పకూలిన 30 లక్షల జీవితాలు.. మేస్త్రీలు, కూలీలకు నష్టం 12 వేల కోట్ల పైనే!

ఉరై చుట్టుకున్న కొరత.. 4 నెలలుగా పనిలేక ఇబ్బందులు
తిండికి లేక అప్పులు.. తీరని ఇబ్బందులు
పిల్లలకు ఫీజుల నుంచి బట్టల వరకు తిప్పలే
నలుగురికి ఇచ్చేవారు.. చేయిచాస్తున్న వైనం
సిమెంటు, ఇనుము వ్యాపారాలు ఢమాల్‌
అప్పులు తెచ్చిన బిల్డర్ల బతుకు వర్ణనాతీతం
కూలీలను కూర్చోబెట్టి డబ్బివ్వాల్సిన పరిస్థితి
మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటంలా తయారైంది కూలినాలి చేసుకునే జీవుల పరిస్థితి. ఇసుక కొరత.. లక్షల మంది మెడకు ఉరితాడై చుట్టుకుంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో భవన నిర్మాణ కూలీల జీవితాలు దారుణంగా చితికిపోయాయి. ఒకప్పుడు తాపీ మేస్ర్తీలుగా నలుగురికి పనులు చూపించిన వాళ్లు.. ఇప్పుడు తిండి కోసం నలుగురి దగ్గరా అప్పు తీసుకోవాల్సిన దుస్థితి. ఈ నాలుగు నెలల్లో.. పిల్లల చదువులకు స్కూల్‌ ఫీజు కోసం నానా తంటాలు.. కొత్త బట్టల్లేవు.. ఒక సినిమా లేదు.. సంతోషం లేదు. గ్రహపాటున ఎవరికైనా జబ్బు చే స్తే ఇక అంతే.

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది మేస్ర్తీలు, నిర్మాణ రంగ కూలీలు ఉన్నారు. ఇప్పుడు ఇసుక దెబ్బతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వీరిలో సగటున 15 లక్షల మందికి గత నాలుగు నెలలుగా పనిలేదు. నెలకు కనీసం రూ.20 వేలు సంపాదించుకునే మేస్ర్తీలు, కూలీలకు.. నాలుగు నెలలుగా సంపాదనే లేదు. నాలుగు నెలలకు కలిపి ఒక్కో మేస్త్రీ నష్టపోయిన ఆదాయం రూ.80 వేలు. సగటున 15 లక్షల మందికే ఈ నష్టం అనుకున్నా నాలుగు నెలల్లో కూలిజీవులకు వచ్చిన నష్టం రూ.12 వేల కోట్లపైనే! భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నవారిలో సగం మందికి పని దొరికి, సగం మందికి దొరకలేదనుకుంటే.. వేతన జీవికి కలిగిన నష్టం ఇంత. ఇక వీరి సంపాదన తగ్గిపోవడంతో ఆ మేరకు వస్త్రాలు, సరుకులు, వినోదం, షాపింగ్‌.. ఇలా అన్ని వ్యాపారాలూ పడుకున్నాయి. ఇసుక లేక తగ్గిన సిమెంటు, ఇనుము వ్యాపారాలకు తగ్గిన ఆదాయానికి లెక్కేలేదు. ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లకు వచ్చిన నష్టానికి అంతేలేదు. వెరసి మొత్తం ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టం అపారం.

పనికోసం వలస.. తిండికీ కటకట
సాధారణంగా ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన తాపీ మేస్ర్తీలు, కూలీలు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పనుల కోసం వలస వెళ్తుంటారు. 10-15 మంది జట్టుగా ఏర్పడి ఒక భవనం దగ్గర పనికి కుదురుకుంటారు. ఇంటి నిర్మాణానికో, అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికో పనిచేస్తుంటారు. ఇలా వలసవెళ్లిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం.. ఇలా ఎక్కడ చూసినా.. నిలిచిపోయిన నిర్మాణాల కింద డేరాలు వేసుకుని ఇసుక కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. చేయడానికి పనిలేదు.. ఊరుకాని ఊరులో ఏం చేయాలో తెలియదు. బిల్డర్లను బతిమాలుకుని.. కనీసం తిండికైనా ఇమ్మని రోజులు దీనంగా గడిపేస్తున్నారు. వారినలా కూర్చోబెట్టి డబ్బులివ్వడం బిల్డర్లకూ ఇబ్బందిగానే మారింది. నిర్మాణాలు ఆగిపోవడంతో ఫ్లాట్ల విక్రయాలు లేక.. వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న వీరు ఇంకాస్త అప్పుచేసి ఆ మేస్త్రీలకు, కూలీలకు డబ్బులిచ్చుకుంటూ వస్తున్నారు.

ఆ పరిస్థితి చూస్తే కన్నీరే..
సాధారణంగా తాపీ మేస్త్రీ సగటున రోజుకు రూ.700 వరకు సంపాదిస్తాడు. నలుగురిని కూలీకి పెట్టే పెద్ద మేస్త్రీ అయితే ఇంకొంత ఎక్కువే తెచ్చుకుంటాడు. పేదరిక స్థాయికి ఎగువన, దిగువ మధ్యతరగతి జీవనానికి దగ్గరలో వీరి ఆదాయం ఉంటుంది. ఇలా సంపాదించే రోజుల్లో ఇతర పనులకు వెళ్లేవారి కంటే వీరి ఆదాయమే ఎక్కువ. ఇతర పనులకు వెళ్తే రోజుకు రూ.300-500 మధ్యే ఉంటుంది. తమ బంధువర్గంలో ఇతర పనులు చేసుకునేవారి కంటే తాపీమేస్త్రీ కాస్త ఎక్కువే సంపాదిస్తాడు. దీంతో బంధువులకు అవసరమైనప్పుడు కొంత సర్దుబాటు చేసేవారు. పండగలు, పబ్బాలకు ఒక రూపాయి పెట్టేవారు. అలాంటిది వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ‘మా బావ చిన్న స్థాయి తాపీ మేస్త్రీ. నలుగురు కూలీలకు పని కల్పిస్తూ పెద్ద మేస్ర్తీల దగ్గర పనిచేసేవాడు. ఎప్పుడూ మా అందరికీ ఎంతో కొంత సాయం చేసేవాడు. ఏ అవసరం వచ్చినా బావే గుర్తుకొచ్చేవాడు. ఆదుకునేవాడు. అలాంటిది ఈ మధ్యన.. రైతు బజారుకు వెళ్తే మాకూ కాసిన్ని కూరగాయలు పట్టుకురండని అడుగుతున్నాడు. కడుపు నీరైపోతోంది’ అని విజయవాడకు చెందిన డ్రైవర్‌ సునీల్‌ గుండె తరుక్కుపోయేలా చెప్పాడు. ఎంత తాపీ మేస్త్రీ అయినా రెండు నెలలు భరించాడు. ఉన్న డబ్బును ఖర్చుచేస్తూ గడిపేశాడు. అవసరాల్ని వాయిదా వేస్తూ.. అత్యవసరం అనుకున్నదానికే ఖర్చుపెడుతూ నడిపించాడు. కానీ మూడో నెల, నాలుగో నెల కూడా ఆదాయం లేకపోవడంతో ఇక తట్టుకోవడం వల్ల కావడం లేదు.

సార్‌! పనుందా?
కాకినాడలో శ్రీనివాసరెడ్డి.. కాంట్రాక్టుకు నిర్మాణాలు చేస్తుంటాడు. 4 నెలల నుంచీ పని సరిగ్గా సాగడం లేదు. ఇసుక కొరత, పెరిగిన రేటు భరించలేక పనులు ఆపేశాడు. అతడి కింద ఎప్పుడూ 50-60 మంది పనిచేస్తారు. ఉదయం లేవగానే వీరిలో కొందరు ఫోన్‌ చేస్తారు.. రెడ్డిగారూ పనుందా అని. ప్రతి రోజు ఇలా ఫోన్లు వస్తూనే ఉంటాయి. సమాధానం ఒక్కటే. ఇసుక లేదు. పనీ లేదు. సాధారణంగా తొలి ఏకాదశి నుంచి తాపీ మేస్త్రీలు ఏడాదిపాటు పనిచేసేందుకు కూలీలను మాట్లాడుకుంటారు. పెద్దమేస్త్రీలు భవన నిర్మాణాలు ఒప్పుకుని.. పనులు చేసేందుకు తమ స్వస్థలాల్లోని మేస్త్రీలు, సెంట్రింగ్‌ పనిచేసేవారు, ఇసుక మోసేవారు.. మొదలైనవారిని మాట్లాడుకుంటారు. ఏడాదికి ఇంతని మాట్లాడుకోవడం.. లేదంటే రోజుకింత చొప్పున మాట్లాడుకుని.. కొంత అడ్వాన్సు ఇచ్చి పనికి తీసుకొస్తారు. కుటుంబాలతో సహా కూలీలను ఆ ఏడాదిపాటు పనిలో పెడతారు. అయితే ఈ తొలి ఏకాదశి నుంచీ ఇసుక కొరత ఏర్పడడంతో పెద్ద మేస్త్రీలకే కాంట్రాక్టులు దొరకడం లేదు. వారి కింద పనిచేసేవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.

20కి పైగా పనులు చేసేవారికీ ఖాళీ కడుపే
భవన నిర్మాణ పరిశ్రమనే నమ్ముకుని తాపీమేస్త్రీలు, కూలీలే కాదు.. పునాదులు తీసేవారు, మట్టిపనిచేసేవారు, ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, ఫాల్స్‌ సీలింగ్‌, చెక్కపని చేసే వారు, ఇంటీరియర్‌ వర్క్‌, టైల్స్‌ వేసేవారు.. ఇలా సుమారు 20 రకాల పనులకు సంబంధించినవారు ఉంటారు. ఇసుక కొరత వీరందరినీ దారుణంగా దెబ్బతీసింది. ఒకప్పుడు కష్టపడి పనిచేసుకుంటూ.. కొంత సంపాదించుకుంటూ హాయిగా జీవించిన వాళ్లకు.. ఇవాళ.. ఈ పూట కడుపు నిండడం ఎలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాలుగు నెలల ఇసుక తుఫాను వారి జీవితాలను అతలాకుతలం చేసేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *