జమ్మూ: జమ్మూకశ్మీర్లో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు. మరోవైపు చలి తీవ్రత పెరగకముందే సాధ్యమైనంత ఎక్కువ మంది చొరబాటుదారుల్ని భారత్లోకి పంపేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోందన్నారు. అందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనల్ని తీవ్రతరం చేశారన్నారు. అనేక చొరబాటు యత్నాలను సాయుధ దళాలు తిప్పికొట్టినప్పటికీ కొంత మంది ముష్కరులు సరిహద్దు దాటి వచ్చారని, అందులో చాలా మందిని ఎన్కౌంటర్లలో మట్టుబెట్టామని మరికొంత మంది పట్టుబడ్డారని తెలిపారు.
అధికరణ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని దిల్బాగ్ సింగ్ తెలిపారు. జమ్మూ, లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయని, కశ్మీర్లోనూ క్రమంగా శాంతియువత వాతావరణం నెలకుంటోందన్నారు. చొరబాట్లు యత్నాలు తీవ్రమైన నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.