గ్యాస్ట్రిక్ సమస్యను వదిలించుకోవటం ఎలా?
1. అజ్వైన్ లేదా వాము :
వాము లేదా అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది మంచి ఫలితాలను పొందడానికి రోజులో ఒకసారి అర టీస్పూన్ వామును నీటితో కలిపి వేడి చేసి తాగొచ్చు..
2. జీరా వాటర్ (జీలకర్ర నీళ్ళు):
జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం.”జీరా( జీలకర్ర)లో కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి, క్రమంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అదనపు వాయువు ఏర్పడకుండా చేస్తాయి” అని డాక్టర్ సూద్ వివరించారు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. మీ భోజనం పూర్తి చేసిన తర్వాత దానిని చల్లబరచండి, ఆపై వడకట్టి, నీటిని సేవించండి.
3. అసఫోటిడా (హింగ్ లేదా ఇంగువ) :
అర టీస్పూన్ ఇంగువను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా, గ్యాస్ సమస్యను అరికట్టవచ్చని తెలుస్తుంది. మీ కడుపులో అధిక వాయువును ఉత్పత్తి చేసే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే “యాంటీ ఫ్లాటులెంట్” వలె ఇంగువ పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
4. తాజా అల్లం :
గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం అనంతరం ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం కూడా గ్యాస్ ఉపశమనానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడుతుంది. అల్లం సహజమైన కార్మినేటివ్ (అపానవాయువు నుండి ఉపశమనం కలిగించే ఏజెంట్లు) గా పనిచేస్తుంది.
5. బేకింగ్ పౌడర్ నిమ్మరసం మిశ్రమం :
1 టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు.
6. త్రిఫల :
మూలికా పొడి అయిన త్రిఫల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. సగం టీస్పూన్ త్రిఫల పొడిని వేడి నీటిలో 5 నుండి 10 నిమిషాలు ఉంచి, పడుకునే ముందుగా ఈ ద్రావణాన్ని సేవించాలి. ఈ మిశ్రమంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోండి. అధికంగా తీసుకున్న పక్షంలో ఉబ్బరానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.