హైదరాబాద్: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. ఆర్టీసీపై నాలుగు గంటల పాటు సమీక్ష కొనసాగింది. సునీల్ శర్మ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. ఈ భేటీకి మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త వాహనాల నోటిఫికేషన్‌పై కమిటీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమీక్ష సారాంశంపై కాసేపట్లో సీఎంవో ప్రకటన విడుదల చేయనుంది.
పండగపూట ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. 48,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించినట్టేనని సీఎం దాదాపుగా స్పష్టం చేశారు. ప్రభుత్వంలో విలీనం అసాధ్యం.. ఇక చర్చలు జరపమని తెగేసి చెప్పారు. కొత్త వారిని నియమిస్తామని, యూనియన్లలో చేరనివ్వమని చెప్పారు. ఆర్టీసీలో మిగిలిన ఉద్యోగులు 1200 మందిలోపేనని, సమ్మెకు వెళ్లిన వారి పోస్టులన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. 2500 బస్సులను అద్దెకు తీసుకుని నడపాలని, 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలంటూ అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.
‘‘ఆర్టీసీకి ఏడాదికి రు.1200 కోట్ల నష్టం వస్తోంది. రూ.5000 కోట్ల రుణ భారం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరలు వంటి ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చట్ట విరుద్ధంగా అదీ.. పండుగ సీజన్లో సమ్మెకు దిగిన కార్మికులతో రాజీ పడే సమస్యే లేదు’’ అని కేసీఆర్ తెగేసి చెప్పారు.