న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం ఎన్నికల కమిషన్ (ఈసీ)ని నిలదీసింది. శనివారం జరిగిన పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారి గణాంకాలను ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది. ఈ ప్రక్రియలో ఏదైనా మాయాజాలం జరుగుతున్నదేమోనని అనుమానం వ్యక్తం చేసింది.
ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ శనివారం ఎన్నికలు ముగిశాయని, ఇప్పటి వరకు ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ అధికారులెవరూ ప్రకటన చేయలేదని అన్నారు. ఓటింగ్ శాతానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే వెల్లడించాలని, జరిగిన ఆలస్యానికి వివరణ ఇవ్వాలని ఈసీని డిమాండ్ చేశారు.
ఆప్ ఇచ్చిన ట్వీట్లో కూడా నిన్నటి నుంచి (శనివారం నుంచి) ఏం జరుగుతోందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలని పేర్కొంది.
ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఓటింగ్ గణాంకాలను సేకరిస్తున్నట్లు, త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలిస్తోంది.