Breaking News
Home / National / దుర్వినియోగం కులం వల్ల కాదు

దుర్వినియోగం కులం వల్ల కాదు

వెలి ఇంకా ఆగలేదు
దళితులు నిజాయితీ లేనివారు కాదు
వారు అక్రమంగా కేసులు పెట్టరు
దుర్వినియోగం కులం వల్ల కాదు
మానవ తప్పిదాలే ఇందుకు కారణం
సమానత్వ పోరు సాగిస్తూనే ఉన్నారు
మహాత్ముడి జయంతిన సుప్రీం వ్యాఖ్య
ఎస్సీ- ఎస్టీ చట్టం కేసులో తీర్పు రద్దు
అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ‘‘చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కులాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెడుతున్నారని దళితులపై అభియోగాలు మోపడం సరికాదు. వారిని నిజాయితీ లేనివారిగా, అబద్ధాలకోరులుగా చిత్రీకరిస్తున్నారు. ధనాపేక్షతోనో లేక కక్ష తీర్చుకోవడానికో వారు ఈ కేసులు పెడుతున్నారని భావించడం తప్పు..’’ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వారు తప్పుడు కేసు పెడితే దానికి కారణం వారి కులం కాదు. సరైన దర్యాప్తు జరపకపోతేనే అది తప్పుడు కేసు అవుతుంది. దీనికి కులాన్ని ఆపాదించడం సరికాదు’’ అని పేర్కొంది. ‘‘ఎస్సీ ఎస్టీలు ఇప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు.. సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయింది. ఇప్పటికీ అస్పృశ్యత ఉంది. ఇది మారాలి. అప్పుడే 1989లో చేసిన చట్టాల్లాంటివి (ఎస్సీ-ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం) అవసరం పడవు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ రిజర్వేషన్లలాంటివి ఉండవు కాబట్టి ఈ కుల వివక్ష ఉండదు. ఒకటే కులం ఉండాలి.. అది మానవ కులం’’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఆ చట్టం ఇక చెల్లదు
దేశవ్యాప్తంగా హింసావిధ్వంసాలకు, 11 మంది మరణానికి దారితీసిన ఎస్సీ-ఎస్టీ వేధింపుల నిరోధక కేసు తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనలను నీరుగారుస్తూ ఇచ్చిన ఆ తీర్పు రాజ్యాంగ నిబంధనలను అనుసరించి లేదని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ తీర్పును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిరుడు ఇచ్చిన తీర్పునకు ముందస్తు స్థితిని కోర్టు పునరుద్ధరించింది.

నాటి తీర్పు ఏంటి?
ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, నిరపరాధులపై కూడా అక్రమంగా కేసులు పెట్టి జైలుపాల్జేస్తున్నారని గతంలో సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ గోయెల్‌తో కూడిన ధర్మాసనం 2018 మార్చి 20న ఓ కీలక తీర్పును వెలువరించింది. దాని ప్రకారం: (1) ప్రభుత్వోద్యోగిపై ఈ చట్టం కింద కేసు పెట్టాలంటే సదరు ఉద్యోగి పైఅధికారుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎకాయెకిన అరెస్టు చేయకూడదు, కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకూడదు. (2) సామాన్య ప్రజానీకంపై ఈ కేసు పెడితే, తొలుత డీఎస్పీ ర్యాంకు అధికారి ఆ ఫిర్యాదును పరిశీలించి, వేధింపుల మాట నిజమని సంతృప్తి చెందిన తరువాతే అరెస్టు చేయాలి. (3) ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం వేధింపులు నిజం కాదని తదనంతర దర్యాప్తులో తేలితే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చు, దానికి ఏ ఆటంకమూ లేదు.

చట్టంపై కోర్టు ఇప్పుడేమంది?
కేంద్రం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను పరిశీలించిన త్రిసభ్య బెంచ్‌ నిరుడు ఇచ్చిన తీర్పును దాదాపుగా కొట్టిపారేసింది. ‘‘ఎస్సీ ఎస్టీల హక్కులను రాజ్యాంగంలోని 15వ అధికరణం కాపాడుతోంది. చట్టాలు చేసే పరిధి పార్లమెంటుదే. దాని పరిధిలోకి కోర్టులు వెళ్లకూడదు. నిరుడు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 142వ అధికరణానికి విరుద్ధం. చట్టం దుర్వినియోగమవుతోందన్న కారణంతో ఆ చట్టాన్నే నీరుగార్చడం తప్పు’’ అని ధర్మాసనం పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *