హైదరాబాద్: ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే తాజాగా దర్శకుడు కొరటాల శివను నటుడు రామ్చరణ్ ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘అనుకోకుండా కొరటాల శివ కార్యాలయానికి వెళ్లి ఆయన్ని కలిశాను. సినిమా పట్ల ఆయన చూపించే ఉత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చిరు 152 సినిమాకి ఆల్ ది బెస్ట్.’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత రామ్చరణ్ నటిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియాభట్ నటిస్తున్నారు.