చైనా: కొన్నాళ్ళుగా భారతీయ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో బాహుబలి, 2.0 చిత్రాలు చైనాలో విడుదలై మంచి విజయం సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం చైనాలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో క్రిష్ తెరకెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలయింది. భారీ బడ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో పదునైన కత్తులతో శత్రువులపై ఝాన్సీ పోరాడే తీరు ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. ఈ చిత్రాన్ని చైనాలో వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల వసూళ్లు సాధించిన మణికర్ణిక చిత్రం చైనాలో ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.
