కులశేఖరపట్నంలో మరో రాకెట్ ప్రయోగ కేంద్రం
అనువుకానిచోట నిర్మాణానికి ఇస్రో సన్నాహాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అనువైన ప్రాంతాన్ని గుర్తించాలి. అక్కడి వాతావరణం, నైసర్గిక పరిస్థితులు అన్నీ అనుకూలించాలి. అప్పుడే సౌండింగ్ రాకెట్ల నుంచి.. జీఎ్సఎల్వీ-మార్క్3 వంటి బాహుబలి రాకెట్ల వరకూ విజయవంతంగా ప్రయోగించవచ్చు. నెల్లూరులోని శ్రీహరికోట వీటన్నింటికీ అనువైనది కాబట్టే 1971లో ఇక్కడ ‘శ్రీహరికోట హై అల్టిట్యూట్ రేంజ్’ (షార్)ను ఏర్పాటుచేశారు. దీంతో ఐదు దశాబ్దాలుగా దేశంలోని ఏకైక స్పేస్ పోర్టుగా షార్ కొనసాగుతోంది. ఇప్పుడు దేశంలో మరో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోంది. మంచి నిర్ణయమే అయినా.. ఎన్నుకున్న ప్రాంతమే విమర్శలకు తావిస్తోంది.
ఏడేళ్ల క్రితమే సన్నాహాలు
వాస్తవానికి దేశంలో మరో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశారు. స్థల పరిశీలన కోసం అప్పటి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ 2012-13లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ కే.నారాయణను చైర్మన్‌గా నియమించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పే తమిళ మంత్రి తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా కులశేఖరపట్నంలో ఈ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. మంత్రి కోరిక మేరకు నిపుణుల కమిటీ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అనువైన ప్రాంతం కాదని, అక్కడి నైసర్గిక పరిస్థితులు రాకెట్ ప్రయోగాలకు సరిపోవని నిర్ణయిస్తూ నివేదిక సమర్పించింది. పైగా కులశేఖరపట్నానికి 57 కిలోమీటర్ల దూరంలోనే కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం ఉండటంతో రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తే ప్రమాదకరమని సూచించారు. అలాగే తూతుక్కుడిలో అనేక రసాయనిక కర్మాగారాలు ఉండటంతో కులశేఖరపట్నం రాకెట్ ప్రయోగాలకు అనువైనది కాదని తేల్చిచెప్పారు.
మళ్లీ తెరపైకి..
ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రస్తుతం కులశేఖరపట్నంలో ఎస్‌ఎ్‌సఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ల ప్రయెగాల కోసం ఒక కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పాత ఫైల్‌ను బయటకు తీసి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తనకు నమ్మకస్తుడైన శివన్ ప్రతిపాదనకు మోదీ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దక్షిణ భారతంలో బీజేపీని బలోపేతం చేయాలన్న మోదీ, అమిత్ షాల వ్యూహంలో భాగంగానే తమిళ ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ రాకెట్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.