కావలసిన పదార్థాలు :
అరటిపువ్వు – పెద్దది, చింతపండు – 50గ్రా,ఉల్లిపాయలు – 4 పెద్దవి, పచ్చి మిరపకాయలు – 6, తాలింపు సామాన్లు – రెండుచెంచాలు, ఇంగువ – చిటికెడు
ఆవకోసం :
ఆవాలు – చెంచా, ఎండు మిరపకాయలు – 2 తెల్ల నువ్వుల పప్పు – 3 చెంచాలు, నూనె – తగినంత, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు.
తయారీ విధానం :
అరటిపువ్వును ఒలిచి పువ్వులో రేకులను (వీటిని దొంగలు అని అంటారు. మొగ్గల్లా ఉంటాయి) తొలగించి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న పువ్వులన్నింటిని రోటిలో గాని మిక్సిలో గాని వేసి కచ్చా, పచ్చాగా దంపుకుని జల్లెడలో వేసి నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పువ్వుకున్న వగరు పోతుంది. తరువాత ఓ బాణలిలో నూనె పోసి ఇంగువ, తాలింపు సామాన్లు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత దంపుకున్న అరటిపువ్వును కూడా చేర్చి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. అరటిపువ్వు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిసికి పోయాలి. పులుసు బాగా అరటిపువ్వుకి పట్టి నీరు ఇగిరేవరకు ఉడికించాలి. దీంతో కూర తయారవుతుంది. తరువాత ఆవాలు, నువ్వుల పప్పు, రెండు ఎండుమిర్చి, ఉప్పు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి పోపు ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన అరటిపువ్వు కూరకి కొద్దిగా నూనె వేసి కలపాలి. అంతే కమ్మని పులుసుతో అరటిపువ్వు కూర రెడీ అవుతుంది.