Breaking News
Home / States / Andhra Pradesh / 12 ఏళ్ల తర్వాత శరీర భాగాల సేకరణ…..ఆయేషా రీపోస్టుమార్టం..?

12 ఏళ్ల తర్వాత శరీర భాగాల సేకరణ…..ఆయేషా రీపోస్టుమార్టం..?

పుర్రె, ఎముకల గాయాలే కీలకం.. ఆయేషా రీపోస్టుమార్టం పూర్తి
12 ఏళ్ల తర్వాత శరీర భాగాల సేకరణ.. సహకరించిన తల్లిదండ్రులు
న్యాయం జరగడంపై ఇంకా సందేహమే!
తెనాలి: ఆయేషామీరా ఖనన దేహానికి సీబీఐ అధికారులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం ఉదయం  మొదలైన ఈ ప్రక్రియ సుమారు పది గంటలపాటు కొనసాగింది. సీబీఐ అధికారులు ఆయే షా తండ్రి, మతపెద్దల సమక్షంలో.. ప్రతి అంశాన్నీ వీడియోలో చిత్రీకరిస్తూ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. దీని కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యులు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు, తమిళనాడు, కేరళ నుంచి డీఎన్‌ఏ నిపుణులు గుంటూరు జిల్లా తెనాలికి వచ్చారు. సీబీఐ ఎస్పీ విమలాదిత్య ఆధ్వర్యంలో చెన్నై, విశాఖ, హైదరాబాద్‌ నుంచి సీబీఐ సిబ్బంది శనివారం తెల్లవారుజామున తెనాలి చేరుకున్నారు. ఆయేషా తలపై తగిలిన గాయా న్ని నిర్ధారించుకునే కీలక అంశాన్ని నివృత్తి చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. సమాధి నుంచి ఆయేషా ఎముక భాగాలు కొన్ని, వెంట్రుకలు, మూడు భాగాలుగా విడిపోయిన పుర్రెతోపాటు, అవసరమవుతుందనుకున్న మరికొన్ని భాగాలను జాగ్రత్తగా ప్యాక్‌ చేసుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులో ఇవే కీలకం కానున్నాయని ఆయేషా తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు.

రీ పోస్టుమార్టం ఎందుకు?
అప్పట్లో పోలీసులు కోర్టుకు అందించిన ఆయేషా డీఎన్‌ఏ రిపోర్టుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు విచారణ జరిపిన పోలీసులు.. ఆయేషా నుదురు భాగంలో బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని, రెండు ఆయుధాలను ఉపయోగించరనే వివరాలను పేర్కొన్నా, ఆయేషా తల్లి షంషద్‌ బేగం అప్పుడే అనుమానాలు వ్యక్తంచేశారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న ఆమె హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో గోడపై రక్తపు మరకలున్నాయని, తలను గోడకు కొట్టటం వల్ల చనిపోయిందని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికితోడు ఆయుధాలు కూడా ఉపయోగించారని, వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అప్పుడే మాయం చేసేందుకు ప్రయత్నించారని, తాను చూసిన గంట తర్వాత వాటిని కడిగేశారని ఆరోపిస్తూ వచ్చారు.

సీబీఐ అధికారులకూ ఇదే వివరించారు. మహిళా కోర్టులో విచారణ జరిపిన అనంతరం, ఈ కేసుకు సంబంధించిన రికార్డులు మొత్తం ధ్వంసం చేయటం, ఆధారాలు సీబీఐకి లభించే పరిస్థితి లేకపోవటంతో వారు ఇప్పుడు.. ‘పుర్రెపై దెబ్బ’ అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. కేవలం తలపైనే కాకుండా మెడ భాగంలోనూ దెబ్బలు ఉన్నాయని ఫొటోల్లో కనిపించినా, ఎఫ్‌ఐఆర్‌లో చూపలేదని ఆయేషా తరపు న్యాయవాది శ్రీనివాస్‌ గతంలోనే వాదిస్తూ వచ్చారు. ముస్లింల ఆనవాయితీ ప్రకారం ఒకసారి ఖననం చేసిన దేహాన్ని తవ్వటం నిషిద్ధమైనప్పటికీ, ఈ కేసులో దోషులను గుర్తించేందుకు సహకరిస్తామని చెప్పిన ఆయేషా తల్లిదండ్రులు సంషద్‌బేగం, ఇక్బాల్‌ బాషా రీ పోస్టుమార్టంకు అంగీకరించారు.

నిర్భయ, దిశ చట్టాలు డ్రామాలే!
ఇన్నేళ్ల తర్వాత మా పాప కేసు విచారణ తిరిగి మొదటికొచ్చింది. సీబీఐ విచారణ పూర్తయ్యాక కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. కీలక ఆధారాలన్నీ అప్పట్లోనే ధ్వంసం చేయడం ఇందుకు కారణం. నిర్భయ, దిశ చట్టాలు అన్నీ రాజకీయ నాయకులు ఆడే డ్రామాలే. 21 రోజుల్లో ఎట్లా సాధ్యమవుతుంది? దిశ చట్టంతో ఎందరు అమాయకులను బలిచేస్తారో చెప్పలేం. పోలీసులు నిజంగా న్యాయం చెయ్యాలనుకుంటే, ఆయేషా కేసులో దోషులను పట్టుకోవాలనుకుంటే అప్పుడే పట్టుకునేవారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ప్రభావం లేకుండా ఉంటే ఈ చట్టాలతో పనిలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంలేదు. సమాజం కోసమే నేటికీ మేం పోరాటం చేస్తున్నాం. మరో అడపిల్లకు అన్యాయం జరగకూడదన్నదే మా ఆకాంక్ష. సీబీఐ విచారణ మొదలుపెట్టికూడా సంవత్సరం దాటిపోతోంది. ఎప్పుడు తేల్చుతారో చూద్దాం.
ఇక్బాల్‌ బాషా, ఆయేషా తండ్రి

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *