హైదరాబాద్: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన హిట్ సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో విదేశాల్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ కథానాయకులు ప్రభాస్, రానా. ప్రస్తుతం రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రానా మరోసారి కలిశారు. కొత్త సినిమా కోసం అనుకుంటున్నారా కాదండీ. వీరందరూ కలిసింది ‘బాహుబలి’ కోసమే.
లండన్లో పేరుపొందిన రాయల్ ఆల్బర్ట్ హాల్లో శనివారం ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శన జరుగుతున్నంతసేపు బాహుబలి చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, శోభూ యార్లగడ్డ లండన్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్మీడియా వేదికగా అభిమాలతో పంచుకున్నారు రాజమౌళి. ‘రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరగనున్న ‘బాహుబలి’ ప్రదర్శన కోసం మేము లండన్ చేరుకున్నాం’ అని రాజమౌళి తెలిపారు. మరోవైపు రానా మరికొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నాకెంతో ఇష్టమైన వారితో చల్లని సాయంత్రం’ అని పేర్కొన్నారు.