Breaking News
Home / hyderabad / బయో డైవర్సిటీ యాక్సిడెంట్‌’పై వీడని ఉత్కంఠ

బయో డైవర్సిటీ యాక్సిడెంట్‌’పై వీడని ఉత్కంఠ

హైదరాబాద్‌ : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ దుర్ఘటనపై విచారణ ఆలస్యం అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారు నడిపిన వ్యక్తి ఆస్పత్రిలో ఉండటంతో అతని అరెస్టు వాయిదా పడుతోంది. ఘటన జరిగి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడం బాధిత కుటుంబాలను కలచివేస్తుందనడంలో సందేహం లేదు. నిందితుడు ఆస్పత్రి నుంచి బయటకు రానంత వరకు ఏమీ చేయలేమని రాయదుర్గం పోలీసులు చెబుతున్నారు. గత నెల 23న బయోడైవర్సిటీ నుంచి అతి వేగంగా వెళుతున్న ఓ కారు 60 అడుగుల పై నుంచి కింద పడి బస్టా్‌పలో బస్సు కోసం ఎదురుచూస్తున్న సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా ఉన్న ఆ ఫ్లైఓవర్‌పై 40 కి.మీ. మించి వేగం ఉండరాదని అధికారులు నిబంధనలు విధించారు. అయితే ఆ రోజు కారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లడంతో అదుపు తప్పి పై నుంచి కిందపడింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ కల్వకుంట్ల కృష్ణారావుతో పాటు మరి కొంతమంది గాయాల పాలయ్యారు.

ఆ రోజు నుంచి హైటెక్‌సిటీ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణారావుపై కేసు నమోదు చేసినప్పటికీ అతడిని అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఓ మహిళ మృతికి కారకుడయ్యాడనే ఆరోపణలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే కేర్‌లో చికిత్స పొందుతున్న కృష్ణారావు కొన్ని రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన బయటకు రాలేదు. నొప్పులు ఇంకా తగ్గలేదని… ఫిజియోథెరపి పూర్తికాలేదంటూ అతను ఆస్పత్రిలోనే ఉంటున్నారు. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని అరెస్టు చేయడం సాధ్యం కాదంటూ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడికున్న పెద్ద పరిచయాలతోనే అరెస్టులో జాప్యం జరుగుతోదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఫ్లైఓవర్‌ మూసేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఇంజనీరింగ్‌ నిపుణులతో పాటు పోలీసు ప్రముఖులు పరిశీలించారు. ఫ్లైఓవర్‌ డిజైన్‌ లోపాలు గుర్తించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే బ్రిడ్జిపై ఆధ్యయనం చేసిన కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తుది నివేదిక అనంతరం మార్పులు చేర్పులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పనులు పూర్తి చేసే వరకు రాకపోకలపై నిషేధం విధించారు. పూర్తి స్థాయి నివేదిక వస్తే దీన్ని ఇంజనీరింగ్‌ విభాగం ఆమోదిస్తే అప్పుడు లోపాలు సరిచేయాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *