Breaking News
Home / National / టీఆర్‌ఎస్‌ సర్కారుపై ఆరు నెలల్లో నలువైపులా ఉచ్చు

టీఆర్‌ఎస్‌ సర్కారుపై ఆరు నెలల్లో నలువైపులా ఉచ్చు

నేటి అసెంబ్లీ ఫలితాల తర్వాత బీజేపీ కార్యాచరణ
బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ పడాలని అభిప్రాయం
న్యూఢిల్లీ: తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం నిర్దిష్ట కార్యాచరణతో రంగంలోకి దిగబోతోంది. హరియాణ, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి, అక్కడ కొత్త సర్కార్లు కొలువుదీరిన తర్వాత రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతోంది. ఆర్టీసీ సమ్మె సుదీర్ఘంగా సాగుతుండడం, కార్మిక-ఉద్యోగవర్గాలతో పాటు సకల జనుల్లో వెల్లువెత్తుతున్న నిరసనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలన్నది కమలనాథుల వ్యూహం. కేసీఆర్‌ సర్కార్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలను సైతం శోధించి నిజాలను ప్రజల ముందుంచేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. తొలి ఐదేళ్లలో అవినీతికి తావులేకుండా పాలించామని చెప్పుకుంటున్నప్పటికీ వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో భారీగానే అవినీతి జరిగిందనీ, ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బీజేపీ సిద్ధం చేసుకుందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బయటకు కనిపించేవే కాకుండా లోపాయికారీగా చాలానే జరిగాయనీ, వాటన్నింటి వివరాలూ ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. వీటి ఆధారంగా ఏం చేయాలన్న విషయంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.

లక్ష్యం కేసీఆరే అయినా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తాన్ని టార్గెట్‌ చేయాలన్నది బీజేపీ నిర్ణయం. సర్కారు తీసుకున్న, తీసుకుంటున్న ‘ప్రజా-వ్యతిరేక’ చర్యలు, వివిధాంశాలపై అనుసరిస్తున్న వైఖరి మీద కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పార్టీ రాష్ట్ర నేతలు పలు దఫాలు చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. వచ్చే ఆరునెలలూ కీలకంగా మారబోతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్వాకాలను అన్ని రీతుల్లో హైలైట్‌ చేయాలని- అంటే అటు కోర్టులు, దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న ఈ ఆరు సంవత్సరాల్లో కేసీఆర్‌ పరిపాలన ఇంతగా ఎన్నడూ అప్రతిష్టపాలు కాలేదని, బలహీనంగానే ఉన్న సమయంలోనే ఆయనను రాజకీయంగా దెబ్బతీయాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి ప్రధానితో సమావేశమైన సమయంలో రాజీయత్నాలు జరిగాయని, కానీ అవేవీ నెరవేరలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీయే ప్రత్యామ్నాయం!
తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని పటుతరంగా మార్చేందుకు ఈ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని బీజేపీ నిశ్చయించినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ బలహీనపడిందని, టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే సత్తా తమకు మాత్రమే ఉందని ప్రజల్లోకి తీసికెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి-రహిత, నిర్ణయాత్మక పాలనను ప్రజల్లో ప్రచారం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా అడ్డుపడుతోందో వివరిస్తూ ధాటిగా ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.

కేసీఆర్‌ సర్కార్‌ పనితీరు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్‌ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అమిత్‌ షాకు నివేదిస్తున్నారు. త్వరలో కేసీఆర్‌ సర్కార్‌ అంతర్గత సంక్షోభంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయని బీజేపీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు. కాగా హుజూర్‌ నగర్‌ ఎన్నికల ఫలితాలకూ, బీజేపీ కార్యాచరణకూ ఏ సంబంధమూ లేదని, ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం, అక్రమ మార్గాలు, ప్రభుత్య యంత్రాంగ దుర్వినియోగం… మొదలైన వాటి ద్వారా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కేసీఆర్‌ చేసిన ప్రయత్నాల గురించి తమకు సమాచారం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *