అమరావతి: స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే శకుని మామా.. నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది? అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. గోదావరిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వరద ఉన్నప్పుడు బోటు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరంటూ విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ ఎంత మంది మృతదేహాలు వెలికితీశారు? ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ తుగ్లక్ వైఎస్ జగన్‌ది అన్నారు.
బోటు ప్రమాదంలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు గతంలో మీరు డిమాండ్ చేసిన విధంగా 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తున్నారు? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే, మరి మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? సమాధానం చెప్పగలవా శకుని మామా!!’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.