Breaking News
Home / States / Andhra Pradesh / సీఎంలను బెదిరిస్తున్న కేంద్రం

సీఎంలను బెదిరిస్తున్న కేంద్రం

మనువాదాన్ని రుద్దుతున్న బీజేపీ
దేశంలో నియంతృత్వ రాజకీయాలు
హక్కుల నేత హరగోపాల్‌ వ్యాఖ్యలు
మోదీకి లేఖ రాస్తే ద్రోహులా: నాగేశ్వర్‌
ఐలూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
విజయవాడ: రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాలను ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు బీజేపీ దాని అనుబంధ హిందూత్వశక్తులు ప్రయత్నిస్తున్నాయని పౌరహక్కుల ఉద్యమనేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హిందూత్వ శక్తులు నిరుపయోగంగా భావిస్తున్నాయని, సామాన్యులకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం పెరిగేలా న్యాయవాదులు కృషి చేయాలని పేర్కొన్నారు. రెండు రోజులు జరిగే అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలూ) 11వ రాష్ట్ర మహాసభలు శనివారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఐలూ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన మహాసభల్లో మొదటి రోజు ‘భారత రాజ్యాంగం-ప్రాథమిక హక్కులు’ అంశంపై హరగోపాల్‌ మాట్లాడారు.

దేశంలో హిందూ రాష్ట్ర భావన స్థాపన కోసం బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని, ఉపచట్టం పేరుతో ముఖ్యమంత్రులను కేంద్రం బెదిరిస్తోందన్నారు. జడ్జీలను సైతం బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఉంటుందా? మారుస్తారా? అనే ఆందోళన మేధావుల్లో నెలకొందని, మారిస్తే ఎలా మారుస్తారనే భయంతో గడుపుతున్నారని అన్నారు. 1980 నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతమైన మతాన్ని బహిరంగ విషయంగా మార్చి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ‘భారత రాజ్యాంగం-సవాళ్లు’ అంశంపై రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ, సమాజంలో అజ్ఞానాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మలుస్తున్నారని దుయ్యబట్టారు. ‘రూల్‌ ఆఫ్‌ లా’ బదులు ‘రూల్‌ ఆఫ్‌ ఫెయిత్‌‘ వచ్చిందన్నారు. అసమ్మతిని నేరపూరితం చేశారన్నారు.

ప్రధానికి ఉత్తరం రాస్తే దేశద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘న్యాయపాలన-న్యాయవాదుల పాత్ర’ అంశంపై ఐలూ జాతీయ అధ్యక్షుడు బికాస్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్నారు. న్యాయవాదులు తమ సమస్యలపైనే కాకుండా సామాజిక సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌, ఐలూ గౌరవాధ్యక్షుడు ఆర్‌.రామాంజనేయులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *