గుంటూరు: క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చారని, ఆలయఒ అపవిత్రత కాకుండా ఇతర మతస్థులు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్ కలాం, సోనియాగాంధీలు కూడ అలా డిక్లరేషన్ ఇచ్చారని, జగన్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి కంటే జగన్ అతీతుడా? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు స్వామివారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందన్నారని, ఇప్పుడు ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేదే లేదంటున్నారని, పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వైసీపీ కార్యకర్తలు టీడీపీపై పెట్టిన ప్రతి పోస్టును డీజీపీకి ఇచ్చామని, అవి డీజీపీకి ఎందుకు కనిపించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. లక్ష రూపాయల ఫర్నీచర్‌పై ఎన్నో పోస్టులు పెట్టి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమయ్యారని, మరి రూ.43వేల కోట్లు దోచుకున్న జగన్‌ని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఒక మాజీ డీజీపీపై అసభ్య పోస్టు పెడితే ప్రస్తుత డీజీపీకి, పోలీసులకు రోషం లేదా? అని చంద్రబాబు నిలదీశారు.