Breaking News
Home / States / Andhra Pradesh / అవినీతి సామ్రాజ్యాన్ని.. వాటాలు వేసి పంచుతున్నారు

అవినీతి సామ్రాజ్యాన్ని.. వాటాలు వేసి పంచుతున్నారు

వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా జగన్‌
సీఎం పంచాయతీలు చేయడమేంటి?
స్టేషన్‌ ఎదుట మహిళా అధికారి ఆందోళనా?
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడైనా ఉందా?
నెల్లూరు కార్యకర్తల భేటీలో బాబు ఆగ్రహం
గుంటూరు: వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని సీఎం జగన్‌ వాటాలు వేసి పంచుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన నెల్లూరు జిల్లా కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా సీఎం ఇసుక పంచాయితీలు చేస్తున్నారా అని నిలదీశారు.. ‘నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో పోటీ పడి దందాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే దీని వెనుక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మధ్యవర్తిగా చేసే పంచాయితీలు మరో ఎత్తు.. ఇసుక దందాలు, భూకబ్జాలు… ఇలా వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని వాటాలు వేసి జగన్‌ పంచుతున్నారు.

ఒక మహిళా అధికారి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేసి కరెంటు కట్‌ చేయడం, తాగునీరు నిలిపివేయడం, చెత్త తెచ్చి వెదజల్లడం, పాములు, జెర్రులు వేస్తామని బెదిరించడం ఎంత అరాచకం? దాడి చేశారంటూ అర్ధరాత్రి ఒక మహిళ.. అందులోనూ ఒక మండల అధికారి పోలీసు స్టేషన్‌ ఎదుట 8 గంటలు ఆందోళన చేయడం.. ఈ దుస్థితి గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా ఉందా’ అని ప్రశ్నించారు. బెయిలబుల్‌ సెక్షన్లతో కేసులుపెట్టి కేవలం రెండు గంటల్లో రైట్‌ రాయల్‌గా కోటంరెడ్డిని విడుదల చేయడం రాష్ట్రంలో జగన్నాటకాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘ఆ రోజు వనజాక్షి విషయంపై ఇదే వైసీపీ నేతలు ఏం మాట్లాడారో, ఎన్నెన్ని విమర్శలు చేశారో? ఆ సంఘటనపై టీడీపీ ప్రభుత్వం శర్మ కమిటీని నియమించింది. వాస్తవాలను విచారించి ప్రజల ముందు పెట్టింది.

ఇప్పుడు ఎంపీడీవో సరళను బెదిరించడం, ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విషయంలో ఏం చేశారు? ముఖ్యమంత్రి మధ్యవర్తిగా రాజీ చేయడమేమిటి? వైసీపీ నేత ఇంట్లో పంచాయితీ చేయడం దారుణం. దేనికైనా చట్టం ఉంది.. న్యాయస్థానాలు ఉన్నాయి’ అన్నారు. తాను సోమ, మంగళవారాల్లో నెల్లూరులోనే ఉంటానని, వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ఎండగడదామని, ప్రజల ముందు దోషులుగా నిలబెడదామని కార్యకర్తలతో అన్నారు. వైసీపీ నేతల దాడుల బాధితులకు పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *