గుంటూరు: తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై దాడి చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసారావుపేటలో జరిగిన కోడెల సంస్మరణ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల విగ్రహాలకు కూడా అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. అనుమతుల్లేని విగ్రహాలు తీసేయ్యాలని.. సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు.
పనిచేసిన వాళ్లకు బిల్లులు చెల్లించకుండా.. వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారన్నారు. జగన్‌లా తాము దోపిడీ చేయలేదని.. చట్టపరంగా పనులు చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశానని.. కార్యకర్తలను కాపాడుకుంటా, ప్రజలకు అండగా ఉంటానన్నారు. కోడెల కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. నేరస్తుడు సీఎం అయితే ఏం చేస్తాడో చూస్తున్నామని.. నేరస్తుడికి మద్దతిస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను పరోక్షంగా హెచ్చరించారు. కోడెల మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు.