అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో ఇంటిపై నెల్లూరు గ్రామీణ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న అధికారిణిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని అర్ధరాత్రి వేళ ఆమె పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే..కేసు నమోదు చేసేందుకు వెనకడుగు వేశారంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా? అంటూ ధ్వజమెత్తారు. ఆమె ఇంటికి విద్యుత్, నీటి కనెక్షన్ కట్ చేసి, చెత్తకుండీ పెడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయాలేమీ ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించవా?అని ప్రశ్నించారు.
