అమరావతి: ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చొరవ చూపాలని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. 2014-19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ. 1,845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి విడుదల చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిధులను ఇతర వాటికి మళ్లించడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వ చర్యలు ఉపాధి హామీ పథకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో వివరించారు. వీటిపై అనేక కుటుంబాలు ఆధారపడినందున తక్షణమే బిల్లుల విడుదలకు చొరవ చూపాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు.