హైదరాబాద్: ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా జనసేన పార్టీ విడుదల చేయడంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన మెగా అభిమానులు గోవుల మధ్య గోపాలుడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ సైతం ఇన్‌స్టా వేదికగా పవన్ ఫొటోలను షేర్ చేస్తూ ‘ఈ ఫొటోలను చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. త్వరలో గోశాలను ప్రారంభించాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
ఈ ఏడాది విడుదలైన ‘వినయ విధేయ రామా’ చిత్రంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు నటుడు రామ్‌చరణ్. మరోవైపు ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతా రామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో చెర్రీ జంటగా బాలీవుడ్ నటి ఆలియాభట్ నటించనున్నారు.