ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్యంపై తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన చిదంబరం ఫ్యామిలీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డితో కలిసి ఈ బోర్డును ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న చిదంబరం ఇటీవల అనారోగ్యానికి గురైయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సాయంత్రం 7 గంటల్లోగా బోర్డును ఏర్పాటు చేసి చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై నివేదికను శుక్రవారం కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.