Breaking News
Home / National / పౌరసత్వ బిల్లు తెచ్చిన తంటా… శివసేనపై కాంగ్రెస్ బ్లాక్‌మెయిలింగ్?

పౌరసత్వ బిల్లు తెచ్చిన తంటా… శివసేనపై కాంగ్రెస్ బ్లాక్‌మెయిలింగ్?

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి గత నెలలో శివసేన పెట్టుకున్న పొత్తుకు పౌరసత్వ సవరణ బిల్లు ఎసరు పెట్టిందా? అవుననే అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు. ఈ బిల్లుకు లోక్‌సభలో శివసేన పార్టీ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేకి ఫోన్ చేయించి లోక్‌సభలో బీజేపీకి మద్దతుపై నిలదీసినట్టు సమాచారం. గుజరాత్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉద్థవ్ థాకరేకి ఫోన్ చేసి మంతనాలు జరిపినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.

ప్రతిపక్ష పార్టీల నిర్ణయానికి విరుద్ధంగా పౌరసత్వం సవరణ బిల్లుకు మద్దతు ఇస్తే.. మహారాష్ట్రలో శివసేనతో పొత్తును తెగతెంపులు చేసుకునేందుకు కూడా తాము సిద్ధమని కాంగ్రెస్ అధినేత్రి తెగేసి చెప్పినట్టు సమాచారం. రాహుల్ గాంధీ సైతం నిన్న మధ్యాహ్నం ట్విటర్ వేదికగా పౌరసత్వ బిల్లుకు మద్దతు ఇస్తున్న పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిన్న శివసేన చీఫ్ కొత్త పల్లవి అందుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘జాతి ప్రయోజనాల’’ దృష్ట్యా పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలో మద్దతు ఇచ్చామనీ… కానీ తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇంకా జవాబు చెప్పలేదని ఆయన అన్నారు. తాము సూచించిన మార్పులు చేయని పక్షంలో ఈ బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇవ్వబోమంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సోనియా గాంధీ చేయించిన ఒక్క ఫోన్ కాల్‌తో శివసేన వైఖరి మార్చుకున్నప్పటికీ.. శివసేన హిందూత్వ వైఖరికి, కాంగ్రెస్ సెక్యులర్ సిద్ధాంతానికి మరోసారి పెద్ద సవాలే ఎదురైనట్టు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *