Breaking News
Home / National / వచ్చే నెల నుంచి ‘ఇంటింటికీ ఇసుక’: కొత్త పథకాలకు సీఎం శ్రీకారం

వచ్చే నెల నుంచి ‘ఇంటింటికీ ఇసుక’: కొత్త పథకాలకు సీఎం శ్రీకారం

చెన్నై: రాష్ట్రంలో ‘ఇంటింటికీ ఇసుక ’ అనే కొత్త పథకాన్ని వచ్చే నెల ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపనుల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల విలువతో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలు సాగుతున్నాయి. వీటికి రోజుకు 40 వేల లారీలలోడ్ల ఇసుకను వినియోగిస్తున్నారు. అయితే ఆ స్థాయికి నీటి వనరుల్లో ఇసుక అందుబాటులో లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఇబ్బడిమొబ్బిడిగా చెరువులు, వాగుల్లో ఇసుకతవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది.

ఈ రకం ఇసుకకు బదులుగా ఎం-శ్యాండ్‌ (పిండిచేసిన రాతి ఇసుక)పై అవగాహన కలుగజేస్తున్న ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇసుకను కొనుగోలు చేసి పరిశోధించిన అనంతరం విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నై ఎన్నూర్‌, తూత్తుకుడి ప్రాంతాల ఓడరేవుల్లో దిగుమతి చేసుకున్న విదేశీ ఇసుక ధర అధికంగా వున్నప్పటికీ దీనికి కొరత ఏర్పడింది. అందువల్ల భవన నిర్మాణంసంస్థలు ఎం-శ్యాండ్‌పై దృిష్టిసారించాయి. స్థానిక ఎన్నూర్‌ కామరాజర్‌ పోర్ట్‌ రోడ్డు, తాంబరంలో విక్రయిస్తున్న ఎం-శ్యాండ్‌కు డిమాండ్‌ పెరిగింది. రోజుకు 300 లారీల లోడ్‌ ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి.

పొంగల్‌ పండుగ అనంతరం వచ్చే 20వ తేదీ 52 వేల మెట్రిక్‌ టన్నుల ఎం-శ్యాండ్‌తో మలేషియా నుంచి బయలుదేరిన నౌక చెన్నై చేరుకోనుంది. 4.5 మెట్రిక్‌ టన్నుల మలేషియా ఇసుకకు రూ.10,350లుగా ధర నిర్ణయించారు. పోర్ట్టులో దిగుమతి చేసుకునే ఇసుకను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న లారీ యజమానులు తీసుకువెళుతున్నారు. అదే విధంగా ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ఇంటివద్దకే ఇసుకను పంపిణీ చేసే కొత్త పథకానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఫిబ్రవరి మొదటి వారం శ్రీకారం చుట్టనున్నారు.

కొత్త పథకాలకు శ్రీకారం
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో సతమతమవుతున్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తరపున నాటుకోళ్ల పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం శ్రీకారం చుట్టారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఆర్థికంగా నలుగుతున్న 77 వేల మంది మహిళలకు నాలుగు వారాల వయసున్న నాలుగు నాటుకోళ్లను, వాటిని పెంచేందుకు గూళ్లను కూడా సీఎం అందజేశారు. స్థానిక శాంథోమ్‌ ఎంఆర్‌సీ నగర్‌లో రాష్ట్రవ్యాప్తంగా వున్న 11 కార్పొరేషన్లు(చెన్నై మినహాయించి), 124 మున్సిపాలిటీలలో అమలు చేస్తున్న పథకాలను ఒకే ప్రాంతంలో ప్రభుత్వం పర్యవేక్షించే విధంగా ఆధునిక వసతులతో కూడిన 11 అంతస్తుల భవనం ఏర్పాటయ్యింది.

11 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 11 అంతస్తులతో రూ.74 కోట్ల 8 లక్షల వ్యయంతో నిర్మితమైన ఈ భవనంలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు కార్యాలయాలు కేటాయించారు. క్రింది అంతస్తులో డైనింగ్‌హాల్‌, 2వ అంతస్తులో 252 సీట్ల వసతి కలిగిన కాన్ఫరెన్స్‌ హాల్‌, 6వ అంతస్తులో ఆడిటోరియం, శిక్షణ గదులు, ఉద్యోగులకు విశ్రాంతి గది, 7 నుంచి11వ అంతస్తు వరకు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులతో కూడిన ఈ నగరాభివృద్ధి కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించారు.

పోలీసు శాఖ భవనాలు….
తమిళనాడు హోంశాఖ ఆధ్వర్యంలో తేని జిల్లాలో కొత్తగా నిర్మించిన క్వార్టర్లు, పోలీస్టేషన్లు, సబ్‌ జైలు, అగ్నిమాపక శాఖ భవనాలను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. జిల్లాలోని దేవదానంపట్టిలో నిర్మించిన 46 పోలీసు క్వార్టర్లు, తేనిలో నిర్మించిన జిల్లా సబ్‌ జైలు, 294 గృహ సముదాయాలు, 6 పోలీస్టేషన్లు, మరో 9 పోలీసు భవనాలు, 30 జైలు శాఖ ఉద్యోగుల గృహాలు, 44 జైలు శాఖ భవనాలు, రెండు అగ్నిమాపక శాఖ భవనాలను కూడా సీఎం ప్రారంభించారు.

ఉద్యోగ నియామక ఉత్తర్వులు
తమిళనాడు వాటర్‌బోర్డు సంస్థలో పనిచేస్తూ సర్వీస్‌లో మృతి చెందిన ఉద్యోగుల 194 మంది వారసులను కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. టైపిస్ట్‌, డ్రైవర్‌, కార్యాలయ సహాయకులు, వాచ్‌మెన్‌, పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి లాంఛనంగా ఏడుగురికి అందజేసి అభినందించారు. కాగా, నాబార్డ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఎడప్పాడి పళనిస్వామి ‘స్టేట్‌ ఫోకస్‌-2019’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, రాష్ట్ర మంత్రులు ఎస్‌పీ వేలుమణి, పి.తంగమణి, ఓఎస్‌ మణియన్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌, వాటర్‌ బోర్డు ప్రిన్సిపల్‌ కార్యదర్శి హర్మందర్‌ సింగ్‌, మున్సిపల్‌ అడినిస్ర్టేషన్‌ కమిషనర్‌ కె.ప్రకాష్‌, వాటర్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎన్‌ మహేశ్వరన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి షణ్ముగం, భారత రిజర్వ్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ కె.బాలు, నాబార్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పద్మ రఘునాథన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *