చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ వర్తింపు
మరో ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరించిన సీఎం వైఎస్ జగన్
నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాలకూ..
కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలని ఆ దిశగా అడుగులు వేశాం
కొత్తగా మరికొన్ని రోగాలకు చికిత్సలతో 2,200 రకాల వైద్య సేవలు అందుబాటులోకి..
ఆరోగ్యశ్రీలో ఇది మరో మైలురాయి
గతంలో కేవలం 1,059 రోగాలకే
వైద్య సేవలు.. అవీ అరకొరగానే..
బాధితుడు డిశ్చార్జి అయ్యాక ‘వైఎస్సార్ ఆసరా’
ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు
కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలి
కరోనాతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు కొన్ని నెలలపాటు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని (కోవిడ్)తో కలిసి ఎలా బతకాలన్న దానిపై అంద రికీ అవగాహన కల్పించాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. అలాగే.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న వాటిపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలి. 85 శాతం కరోనా కేసులకు ఇంట్లోనే ఉండి వైద్యం పొందవచ్చు. మిగిలిన 15 శాతంలో కూడా కేవలం 4 శాతం కేసులకు మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అమరావతి : వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదని.. అలా జరగకూడదనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పలు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.