2న మండలానికో పంచాయతీలో ఏర్పాట్లు
తూర్పుగోదావరి నుంచి సీఎం ప్రసంగం
అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ స్ర్కీన్లతో ప్రసారం
అమరావతి: గ్రామ సచివాలయాల ప్రారంభాన్ని అక్టోబరు 2న వేడుకగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కలెక్టర్లకు సూచించారు. గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా, 2న ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు ఇతర మౌలిక వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతి సచివాలయంలో నవరత్న హామీలతో కూడిన బోర్డులను ఉంచాలని, అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో సచివాలయ ప్రారంభానికి ఎమ్మెల్యేను కచ్చితంగా ఆహ్వానించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతను ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్దేశించా రు.
సచివాలయ ప్రారంభోత్సవానికి మండలంలో పనిచేసే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లందరూ పాల్గొనాలని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయన ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లలో వీక్షించేలా ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం కాపీని మండల ఈవోపీఆర్డీ అక్కడి ప్రజలకు చదివి వినిపించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా బ్యానర్లు, కళాజాతాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.