విజయవాడ: సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వ్యవస్థను మార్చడానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా అవ్వకముందే లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ హామీలు అమలు చేస్తున్నారని.. జగన్కు ఉన్న కమిట్మెంట్ ఏమిటో తమకు తెలుసన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలని.. అర్హులైన వారికి ఇళ్లు, స్థలాలు ఇస్తామన్నారు. నమ్మకంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగాల నియామకాలను కూడా చంద్రబాబు చులకన చేసేలా అవహేళనగా మాట్లాడుతున్నారని బొత్స ఆరోపించారు. మంచి పనిని స్వాగతించే మనసు ప్రతిపక్షనేతలకు ఉండాలని అన్నారు.