Breaking News
Home / Lifestyle / Business / ఇన్ఫోసిస్ పై సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు

ఇన్ఫోసిస్ పై సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు

ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ పరిస్థితి మరింత జఠిలం అవుతోంది. ఆదాయం, లాభాలు అధికంగా చూపుతున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సిఎఫ్ఓ నీలాంజన్ రాయ్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు పాల్పడిన అనైతిక చర్యలపై కంపెనీ బోర్డు కు, అలాగే అమెరికా లోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసారు.

ఎథికల్ ఎంప్లాయిస్ అనే గ్రూప్ పేరిట ఏర్పడిన విజిల్ బ్లోయర్ బృందం ఈ బాగోతాన్ని బయట పెట్టింది. దీంతో అటు అమెరికా లో, ఇటు ఇండియా లో కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఇదే సమయం లో తాజగా ఇన్ఫోసిస్ పై అమెరికాలో క్లాస్ ఆక్షన్ కేసు నమోదు అయ్యింది. రోసెన్ లా ఫర్మ్ ఈ కేసును దాఖలు చేసింది. అదే సమయంలో ఇన్ఫోసిస్ పై జ్యూరీ ట్రయల్ కు డిమాండ్ చేసింది. కంపెనీ తప్పుడు సమాచారం తో ఇన్వెస్టర్లను పక్కదోవ పట్టించిందని తన కేసు లో రోసెన్ లా ఫర్మ్ ఆరోపించింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

వివరణ కోరిన బిఎస్ఈ …
విజిల్ బ్లోయర్ గ్రూప్ సెప్టెంబర్ లోనే కంపెనీ బోర్డు కు ఫిర్యాదు చేస్తే… ఆ విషయాన్నీ తమకు ఎందుకు తెలపలేదని బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజి (బిఎస్ఈ) ఇన్ఫోసిస్ ను ప్రశ్నించింది. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఎక్స్చేంజి కి సమర్పించిన స్టేట్ మెంట్ లో ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఒక ఆడిటర్ను నియమించినట్లు తెలిపారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఆడిట్ కమిటీ లో భాగస్వాములను చేయలేదని వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత ఆడిట్ కమిటీ తో చర్చించి ఇన్ఫోసిస్ బోర్డు తగిన చర్యలు చేపడుతుందని వెల్లడించారు.

శార్దూల అమర్ చాంద్ మంగళ్ దాస్ …

ఇలా ఉండగా, కంపెనీ లో జరిగిన అవకతవకలు సహా సీఈఓ, సిఎఫ్ఓ లపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు శార్దూల అమర్ చాంద్ మంగళ్ దాస్ అనే ఆడింగ్ ఫర్మ్ ను నియమించారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయం తీసుకోంది. ఈ ఆడిటింగ్ సంస్థకు ప్రత్యేక దర్యాప్తు, ఫోరెన్సిక్ దర్యాప్తు అంశాల్లో చాలా అనుభవం ఉంది. కార్పొరేట్ రంగంలో దీనిని దేశంలోనే అత్యుత్తమ ఆడిటింగ్ సంస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. అందుకే ఇన్ఫోసిస్ కంపెనీ పై వచ్చిన ఆరోపణల విచారణ కోసం దీనిని ఎంపిక చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సెబీ దర్యాప్తు …

భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ పై దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపినట్లు ఈటీ వెల్లడించింది. సెబీ దర్యాప్తు అంటే ఇన్ఫోసిస్ కు కష్టకాలమేనని చెప్పాలి. ఎందుకంటే, గత కొంత కాలంగా కార్పొరేట్ గవర్నెన్స్ పై సెబీ చాలా సీరియస్ గా ఉంటోంది. లిస్టెడ్ కంపెనీల్లో జరిగే ఎలాంటి అవకతవకల నైనా తేలిగ్గా తీసుకోవటం లేదు. భారీ జరిమాణాలతో కొరఢా ఝుళిపిస్తోంది. ఇదే సమయంలో అటు అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసి కూడా ఇన్ఫోసిస్ పై దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇన్ఫోసిస్ కు మరింత గడ్డు కాలమేనని చెప్పాలి. ఒక వేళ ఎస్ఈసి దర్యాప్తు లో తప్పు జరిగిందని తేలితే మాత్రం… ఇన్ఫోసిస్ కు కనీ వినీ ఎరుగని రీతిలో జరిమానా తప్పదు. అమెరికాలో క్లాస్ ఆక్షన్ సూట్ కేసుల్లో జరిమానాలు బిలియన్ డాలర్ల స్థాయిలో కూడా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

షేర్ల పయనమెటు?

ఇన్ఫోసిస్ పై ఆరోపణలు రాగానే మంగళవారం కంపెనీ షేర్లు ఆరేళ్ళ కనిష్ట స్థాయికి పతన మయ్యాయి. బుధవారం కాస్త కోలుకొన్నపటికీ … ఈ రోజు స్టాక్ పతనం తోనే ప్రారంభమైంది. అటు అమెరికా ఇటు ఇండియాలో కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం అవుతున్న వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు మరింత పతనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Check Also

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

Share this on WhatsAppజోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *