Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేతల్లో కన్ఫ్యూజన్!

సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేతల్లో కన్ఫ్యూజన్!

ఓ పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోపక్క జనవరిలోనే వంద స్థానాలకు చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ నేతలు ఎందుకు టెన్షన్‌ పడుతున్నారు? ఏఏ నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికల హడావుడి పెరిగింది. ఇప్పటికే నాలుగైదు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరన్నది ఖరారైపోయింది. దీంతో వారు అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే.. అందులో మదనపల్లె, నగరి నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం జరగలేదు. ఓపక్క ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు జనవరిలోనే వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు అక్కడి నేతల్లో అసహనాన్నీ, అసంతృప్తినీ పెంచుతున్నాయి.

చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే.. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాలను టీడీపీ, ఎనిమిది స్థానాలను వైసీపీ దక్కించుకున్నాయి. ఆ తర్వాత పలమనేరులో వైసీపీ నుంచి ఎన్నికైన అమర్‌నాథ్‌రెడ్డి టీడీపీలోకి చేరారు. దీంతో జిల్లాలో రెండు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య సరిసమానమైంది. ఓడిపోయిన నియోజకవర్గాలకు అప్పట్లో ఎవరైతే పోటీచేశారో వారినే ఇన్‌ఛార్జ్‌లుగా కొన్నాళ్లు కొనసాగించారు. పూతలపట్టుకు లలితకుమారి, గంగాధర నెల్లూరుకు గుమ్మడి కుతూహలమ్మ, పీలేరుకు ఇక్బాల్ అహ్మద్, పుంగనూరుకు వెంకట రమణరాజు, పలమనేరుకు ఆర్వీఎస్ బోస్, చంద్రగిరికి గల్లా అరుణకుమారి, నగరికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు గతంలో ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగారు. గత ఎన్నికల్లో మదనపల్లె సీటును నాటి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డి పోటీచేసి ఓడిపోయారు. నాటినుంచి ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గంగాధర నెల్లూరులో కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణకు బాధ్యతలు అప్పగించారు. పలమనేరులో అమర్‌నాథ్‌రెడ్డి టీడీపీలోకి చేరడంతో అక్కడ ఆర్వీఎస్ బోస్‌ను పక్కకి తప్పించారు. 2019 ఎన్నికల్లో పుంగనూరు అభ్యర్థిగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మరదలు అనీషారెడ్డిని ప్రకటించారు. దీంతో వెంకట రమణరాజుకు ఇన్‌ఛార్జ్‌ పదవి పోయింది. చంద్రగిరి నుంచి పోటీలో ఉండబోనని గల్లా అరుణ తప్పుకున్న సంగతి తెలిసిందే! ఈ తరుణంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానిని చంద్రగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని పీలేరు అభ్యర్థిగా ప్రకటించారు. నగరి విషయానికి వస్తే.. ముద్దుకృష్ణమ అకాల మరణం తరవాత ఇంకా అక్కడ పార్టీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు.

కుప్పం నుంచి చంద్రబాబునాయుడు, పీలేరు నుంచి కిశోర్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు నుంచి అనీషారెడ్డి, చంద్రగిరి నుంచి పులివర్తి నాని, పలమనేరు అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పోటీచేయడం ఖరారైపోయినట్టే! చిత్తూరు నుంచి డీకే సత్యప్రభ, తిరుపతి నుంచి సుగుణమ్మ, తంబళ్ళపల్లె నుంచి శంకర్ యాదవ్, సత్యవేడు నుంచి తలారి ఆదిత్యలకు మళ్లీ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. అలానే పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు టికెట్లు దక్కుతాయో లేదోననే చర్చ సాగుతోంది.

జనవరిలో చంద్రబాబు ప్రకటించే వందమంది జాబితాలో తన పేరు ఉంటుందో లేదోననే టెన్షన్‌లో ఆశావహులున్నారు. ఇంతవరకు ఇన్‌ఛార్జ్‌ల నియామకాలకు సైతం నోచుకోలేని మదనపల్లె, నగరి నియోజకవర్గాల్లో అయితే టీడీపీ నేతల టెన్షన్ వర్ణనాతీతంగా ఉంది. ముద్దుకృష్ణమ మరణం తరవాత పదవుల కోసం ఆయన ఇద్దరు కుమారుల మధ్య పోటీ నెలకొన్నది. దీంతో ఎమ్మెల్సీ పదవిని ఆయన సతీమణి సరస్వతమ్మకు ఇచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ విషయమై ముద్దుకృష్ణమ కుమారులు భానుప్రకాశ్, జగదీశ్‌ మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరినీ చంద్రబాబు అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు. కానీ ఎవరికీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. అక్కడి నుంచి పోటీకి ఆ ఇద్దరితో పాటు.. డీసీసీబీ ఛైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి, ప్రముఖ విద్యాసంస్ధల అధినేత అశోక్‌రాజు వంటి వారు పోటీపడుతున్నారు. మొత్తానికి నగరిలో సమస్య ఇంత జఠిలం కావడానికి ముద్దుకృష్ణమ కుమారుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మదనపల్లెలో టికెట్ ఆశావహులు డజనుకు పైనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డిలతో పాటు రామదాస్ చౌదరి, బోడపాటి శ్రీనివాస్, బొమ్మనచెరువు శ్రీరాములు, రాటకొండ బాబురెడ్డి, కొడవళి శివప్రసాద్ వంటి వారు టికెట్ రేసులో ఉన్నారు. దీంతో అక్కడ కూడా ఇన్‌ఛార్జ్‌ నియామకం పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యులను చంద్రబాబు అమరావతి పిలిపించుకుని మాట్లాడారు. తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఫర్వాలేదని దొమ్మలపాటి రమేష్, నరేష్‌కుమార్‌రెడ్డి, రామదాసు చౌదరిలు స్పష్టంచేశారు. ఈ పరిణామాలను తలచుకుంటూ మదనపల్లె నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు. మరి ఈ నియోజకవర్గాల గురించి చంద్రబాబు మనసులో ఏముందో‍! ఇంకెప్పుడు ఇన్‌చార్జులను ప్రకటిస్తారో‍.. తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Check Also

ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

Share this on WhatsAppజగిత్యాల: జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *