హైదరాబాద్ : త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరం కానుంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. ఇప్పటికే టిఆర్ఎస్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శతవిధాలా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని జనసేన పార్టీని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) జనసేన నేతలను కలిసిన ఓ వీడియోను ఈ పోస్ట్ లో జతపరిచింది.
