హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లను ఖండిస్తున్నామని, ఇంతటి అణచివేత ధోరణిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ నియంతృత్వ ధోరణి వీడాలని, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన, చట్టపరమైన పాలన సాగడం లేదని వ్యాఖ్యానిచ్చారు. త్వరలోనే కేసీఆర్ సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని కోర్టు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. బస్సులు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే సీఎంకు, రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని, వారిని చర్చలకు పిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
