Breaking News
Home / Politics / మీరు చేసుకుంటారు…వారు చేసుకోవద్దా…?

మీరు చేసుకుంటారు…వారు చేసుకోవద్దా…?

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని, ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జీవన్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో రవాణా వ్యవస్థలో ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గిస్తామని కేసీఆర్‌ చెప్పారని, కానీ ఈ ఐదేళ్ల కాలంలో ప్రైవేటు వాహనాలు అదనంగా మరో 5 శాతం పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని వివరించారు. నిర్వహణ లోపం, బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాల్సివచ్చిందని జీవన్‌ రెడ్డి విమర్శించారు.

వేతన సవరణ కాలపరిమితి ముగిసి 30 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. ”మీరు ప్రగతి భవన్‌లో దసరా పండగ చేసుకుంటారు.. కానీ ఆర్టీసీ కార్మికులు పండగ జరుపుకోవద్దా?”అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సమ్మెలో పాల్గొని ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కార్మికులు అనుకోవడం లేదని తప్పని పరిస్థితుల్లో వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టారన్నారు. ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవలేదని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రగతిభవన్‌ వదిలి సచివాలయానికి రారని అందుకే నూతన సచివాలయ నిర్మాణం అవసరం లేదన్నారు. నిర్మాణం వాయిదా వేస్తే ఆ డబ్బుతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చని జీవన్‌ రెడ్డి సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *