Breaking News
Home / National / పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్‌ ఆగ్రహం

పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్‌ ఆగ్రహం

రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టం
మాకొద్దంటూ నినాదాలు
కేపీసీసీ కార్యాధ్యక్షుడు
ఈశ్వర్‌ఖండ్రే ఆధ్వర్యంలో నిరసన
మాజీ ఐఏఎ్‌సల మండిపాటు
కేంద్రప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టులాంటిదని కేపీసీసీ అభివర్ణించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నగరంలో బుధవారం పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర్‌ఖండ్రే నిరసనకు సారథ్యం వహించారు. దేశంలో తాండవమాడుతున్న జటిల సమస్యలను గాలికి వదిలి వివాదాస్పద అంశాలను కేంద్రం ఒక్కొక్కటిగా తెరపైకి తెస్తోందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరు: మతం ప్రాతిపదకన పౌరసత్వ బిల్లును తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర్‌ఖండ్రే అన్నారు. ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేపీసీసీ ఉపాధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ మాట్లాడుతూ దేశంలో పౌరసత్వం పొందేందుకు ఎవరు అర్హులో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనవసర గందరగోళానికి తెర లేపిందని ఆరోపించారు. ఎన్‌ఆర్‌సి, పౌరసత్వ బిల్లుల ద్వారా దేశంలో మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఎన్‌ఆర్‌సీపై మాజీ ఐఏఎస్ ల నిరసన

జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)లు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు సృష్టించడం ఖాయమని, రాజ్యాంగవిరుద్ధమని ఇద్దరు మాజీ ఐఏఎస్‌ అధికారులు మండిపడ్డారు. మాజీ ఐఏఎస్‌ అధికారి కణ్ణన్‌ గోపీనాథన్‌ బుధవారం మంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లుల ప్రకారం దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులు అన్ని ఆధారాలు చూపాల్సి వస్తుందని, విదేశాలకు చెందిన ముస్లిమేతరులకు మాత్రం వీటినుంచి పూర్తి మినహాయింపు ఉంటుందంటున్నారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. నేటికీ దేశంలోని నిరుపేదల వద్ద తగిన ఆధారాలు లేవని వీరందరిపై వలసదారుల ముద్ర వేసి దేశం నుంచి తరిమేస్తారా…? అని ప్రశ్నించారు. రోహింగ్యా ముస్లింలు శరణార్థులుగా వస్తే ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఇప్పుడు పౌరసత్వ బిల్లు కారణంగా వచ్చే ముస్లిమేతరులతో కొత్త సమస్యలు రావా..? అని ఆయన ప్రశ్నించారు. భారతీయులు తాము భారతదేశ ప్రజలమని నిరూపించుకోవాల్సిన దుస్థితి దేశానికి స్వాతంత్య్రం లభించిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా రావడం అత్యంత శోచనీయమని కణ్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు బిల్లులపై దేశ ప్రజలంతా సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లును మరో మాజీ ఐఏఎస్‌ అధికారి శశికాంత్‌ సెంథిల్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. లేఖ ప్రతిని ఆయన మంగళూరులో బుధవారం విడుదల చేశారు. ఇదొక అమానుషమైన నిర్ణయమన్నారు. నిరుపేదలు, గిరిజనులు, కార్మికులు అధికంగా ఎన్‌ఆర్‌సికి బలయ్యే ప్రమాదం ఉందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *