హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని వామపక్ష నేతలు ప్రకటించారు. ఐకాస బంద్కు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్షకు దిగాయి. ప్రజా సంఘాల నాయకులు, ఇతర నేతలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎంతోపాటు ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. లాభాలు వచ్చే మార్గాల్లోనే ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని, నష్టాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. కార్మికుల సమ్మె జీతాల కోసం కాదని, ఆర్టీసీ పరిరక్షణ కోసమని అన్నారు. కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘ ఆర్టీసీకి పట్టణ రవాణాలోనే ఏటా రూ.720 కోట్ల నష్టం వస్తోందని అన్నారు.
