హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు సమ్మె కారణంగా దసరా, దీపావళి పండుగలు జరుపుకోలేకపోయారు. 48వేల మంది ఆర్టీసి ఉద్యోగులు జీతాలు లేక రోడ్డున పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూనంనేని సాంబశివరావు శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సాంబశివరావును ఆయన పరామర్శించారు. ఆర్టీసి విషయంలో కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని విమర్శించారు. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ చర్చల్లేవ్ అనడం సరికాదన్నారు. ఏ అంశమైనా చర్చలతో పరిష్కారమవుతుందన్నారు. సీఎం ఇకనైనా స్పందించి ఆర్టీసి జేఏసిని చర్చలకు పిలవాలని హితవు పలికారు.
