విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దైవకార్యాల్లో నియమ నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారని మండిపడ్డారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వాల్సి ఉండగా…. ఢిల్లీ పర్యటన ఉందని ముందే ఇవ్వడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణ పాలనకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. జలాశయాల్లో నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా అసమర్థతతో సముద్రం పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల కక్కుర్తి కోసం పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపుకు కుట్ర పన్నుతున్నారని, రైతుల ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని దేవినేని హెచ్చరించారు.
