Breaking News
Home / Lifestyle / Astrology / లక్షలాది దివ్వెల ‘రికార్డు’

లక్షలాది దివ్వెల ‘రికార్డు’

దీపావళి అంటే దీపాల వరుస అంటారని తెలుసు. అయితే ఆ వరుస నది పొడవునా కొన్ని కిలోమీటర్ల మేర ఉంటే… అది గిన్నిస్‌ రికార్డు అవుతుంది. గత ఏడాది దీపావళి సందర్భంగా అయోధ్య (ఉత్తరప్రదేశ్‌)లోని సరయూ నది ఒడ్డున అక్షరాలా 3,01,152 దివ్వెలను వెలిగించడం గిన్నిస్‌బుక్‌ రికార్డ్సులోకి ఎక్కింది. ఒకేచోట లక్షలాది దివ్వెల కాంతులను చూసిన జనం ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఇదే స్ఫూర్తితో ఈసారి సరికొత్త రికార్డును సృష్టించేందుకు ఉత్తరప్రదేశ్‌ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది.

దీపావళికి ఇళ్లు, వ్యాపార సముదాయాలను దివ్వెలతో కాంతివంతం చేయడం అన్ని ప్రాంతాల్లో కనిపించేది. అయితే కనుచూపుమేర దీపాల వెలుగుల్ని చూడాలంటే అయోధ్యకు వెళ్లాల్సిందే. దీపావళికి అయోధ్య శోభాయమానంగా మారుతుంది. అక్కడి సరయూ నది దీపకాంతులతో తళుక్కున మెరిసి మురిసిపోతుంది. ఈసారి దీపావళిని మరింత ఘనంగా జరిపేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ దీపోత్సవాన్ని 24 నుంచి 26 దాకా జరుపుతారు. ఇందులో పాల్గొనేందుకు ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, శ్రీలంక, మారిషస్‌ నుంచి కళాకారులు రానున్నారు. ఈసారి దీపోత్సవ్‌లో 3 లక్షల 50 వేల ప్రమిదలను వెలిగించేందుకు ప్రణాళికలు రచించారు.

వీటితో పాటే అయోధ్యలోని దేవాలయాలు, చారిత్రక కట్టడాలను విద్యుత్‌ కాంతులతో తేజోవంతం చేస్తారు. పట్టణంలోని భవంతులు, గోడలను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన రహదారులపై దేశ విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులు, సందర్శకులతో ‘శోభాయాత్ర’ నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ఉండే ఘాట్లపై ‘మహా హారతి’ ఇస్తారు. లైట్‌ అండ్‌ సౌండ్‌ ఫైర్‌వర్క్‌ షోను ఘనంగా జరిపేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది ‘దీపోత్సవ్‌’కు ముఖ్య అతిథిగా దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ హాజరయ్యారు. ఈసారి కూడా విదేశీ అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. సో… ఒకేచోట లక్షలాది దివ్వెల ‘రికార్డు’ వెలుగులు చూడాలంటే అయోధ్యకు వెళ్లాల్సిందే!

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *