Breaking News
Home / Crime / నగరంలో డ్రగ్‌ ముఠా…

నగరంలో డ్రగ్‌ ముఠా…

నగరంలో డ్రగ్‌ ముఠా
పొడి రూపంలో యువతకు చేరవేత
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
నిందితుల్లో ఒకరు ప్రొఫెసర్‌
ఎఫిడ్రిన్‌…కొన్ని వైద్య అవసరాలకు వాడే ఔషధం. డ్రగ్స్‌ మాఫియాకు ఇదో కొత్త వరంగా మారింది. పొడి రూపంలో నగరానికి తరలిస్తూ ఓ ముఠా యువతను బానిసలుగా మారుస్తోంది. దీనిపై పోలీసులు నిఘా పెట్టారు.

హైదరాబాద్: క్రీడాకారులకు ఉత్తేజాన్ని ఇచ్చే ఔషధాల్లో వాడే నిషేధిత ఎఫిడ్రిన్‌ డ్రగ్‌ మాఫియాకు వరంగా మారింది. కొకైన్‌, హషీష్‌ లాంటి మాదక ద్రవ్యాలపై పోలీసులు నిఘా పెంచారు. దీంతో డ్రగ్‌ మాఫియా ఎఫిడ్రిన్‌ను పొడి రూపంలో నగరానికి తరలిస్తూ యువతను బానిసలుగా తయారు చేస్తోంది. ఈ ముఠాను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 600 గ్రాముల ఎఫిడ్రిన్‌ పొడిని స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రాంరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలో డ్రగ్స్‌ అమ్మకాలు పెరిగాయన్న సమచారం మేరకు పోలీసులు పలు చోట్ల ప్రత్యేక నిఘా పెట్టారు.

గాజుల రామారానికి చెందిన ఆకుతోట కిషోర్‌(35) అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద తెల్లటి పొడి లభించింది. మొదట కొకైన్‌ అనుకున్నారు. ల్యాబ్‌లో పరీక్షించగా నిషేధిత ఎఫిడ్రిన్‌ డ్రగ్‌గా నిర్ధారణ అయింది. కిషోర్‌కు కొద్ది కాలం క్రితం అనంతపూర్‌ సీవీ రామన్‌కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తాడిమర్రి చెన్నకేశవులురెడ్డి(40), ఇదే ప్రాంతానికి చెందిన తాపాల్‌ సిలార్‌ అహ్మద్‌ వలీ(38)లు పరిచమయ్యారు. వీరు తరచూ అనంతపురం నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్‌ అమ్మేసి వెళ్లిపోయేవారు. అయితే డ్రగ్స్‌ సరఫరాపై నిఘా పెరగడంతో ఇటీవల ఎఫిడ్రిన్‌ను సరఫరా చేయడం మొదలు పెట్టాడు. తాము చెప్పిన చోట ఎఫిడ్రిన్‌ను సరఫరా చేస్తే కమీషన్‌ ఇస్తామని కిషోర్‌కు ఆశ కల్పించారు. ఇలా ఎఫిడ్రిన్‌ కావాల్సిన వారు చెన్నకేశవులురెడ్డికి ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే దాన్ని కిషోర్‌ సరఫరా చేసేవాడు. పోలీసుల కళ్లు కప్పి నగరానికి ఎఫిడ్రిన్‌ను తరలించడం ఇబ్బందిగా మారడంతో పదిహేను రోజుల క్రితం 600 గ్రాముల ఎఫిడ్రిన్‌ను పొడి రూపంలో నగరానికి తీసుకొచ్చి కిషోర్‌కు అప్పగించి వెళ్లిపోయారు. కిషోర్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెన్నకేశవులు రెడ్డి, అహ్మద్‌ వలీని కూడా అరెస్టు చేశారు. ముంబాయికి చెందిన ఓ మాఫియా ద్వారా వీరికి ఎఫిడ్రిన్‌ సరఫరా అవుతోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఇది కాస్ట్‌లీ గురూ…
మాదక ద్రవ్యాల్లో ఎఫిడ్రిన్‌ చాలా ఖరీదైనది. కొకైన్‌, హషీష్‌ లాంటి పదార్థాలు గ్రాముకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది. స్టాంప్‌ డ్రగ్‌ లాంటి వైతే నాలుగు వందల నుంచి మొదలవుతాయి. కానీ.. ఎఫిడ్రిన్‌ మాత్రం గ్రాముకు రెండు వేలకు పై చిలుకే పలుకుతుంది. ముంబాయి నుంచి గ్రాముకు రెండు వేల చొప్పున కొనుగోలు చేసి దాన్ని నగరంలో యువతకు 3-4 వేల రూపాయల చొప్పున విక్రయిస్తుంటారు. కొకైన్‌, హషీష్‌ కన్నా కూడా ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయని పోలీసులు చెబుతున్నారు. చిటికెడు పొడి నోట్లో వేసుకుంటూ మూడు గంటల పాటు ఉత్తేజంగా ఉంటారని కొన్ని సందర్భాల్లో పరిసరాలను మరిచిపోయి తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారని పోలీసులు అంటున్నారు.

గతంలో కొద్ది కాలం క్రీడాకారుల కోసం తయారు చేసే నొప్పి నివారణ మందుల్లో వీటిని వాడేవారు. బరువు తగ్గించే మందుల్లో కూడా ఉపయోగించేవారు. కానీ.. ఈ డ్రగ్‌ వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించింది. అయినప్పటికీ కొంత మంది చాటుమాటుగా ఈ డ్రగ్‌ను తయారుచేసి అమ్ముతున్నారు. ముంబాయిలో కూడా ఓ గ్యాంగ్‌ ఎఫిడ్రిన్‌ను తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ డ్రగ్‌ నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువ వాడటం వల్ల బీపీ పెరిగిపోయి గుండె, మూత్రపిండాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణాలకు కూడా దారి తీస్తుందని పోలీసులు తెలిపారు.

Check Also

భర్త అనుమానానికి బలైన భార్య

Share this on WhatsAppప్రకాశం: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *