విజయవాడ: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులకు సర్వం సిద్ధమైంది. ఫ్లైఓవర్ పనులు అడుగడుగునా ఆటంకం కలిగించినా ఎక్కడా రాజీ పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వీఐపీల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. మూలానక్షత్రం రోజున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం నుంచి అక్టోబర్ 8 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
అయితే ఇంద్రకీలాద్రి దిగువన దుర్గా ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండడంతో మూలనక్షత్రం రోజున వచ్చే భక్తులకు క్రమ పద్ధతిలో అమ్మవారి దర్శనం కల్పించాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా వినాయకుడి గుడి నుంచి దుర్గాఘాట్, ఘాట్ రోడ్ మీదుగా కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని, శివాలయం మార్గం గుండా కిందకు దిగాలని ఆలయ ఈవో స్పష్టం చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూలైన్ మార్గంలో పాలు, మజ్జిక, మంచినీళ్లు అందిస్తామన్నారు. అదనపు మరుగుదొడ్లు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.