డిసెంబరు 21న పథకానికి శ్రీకారం
వేట విరామంలో మత్స్యకారులకు పదేసి వేలు
‘లా’ చేసి రిజిస్టర్ చేసుకుంటే నెలకు ఐదు వేలు
కొత్త బస్సుల కొనుగోలుకు వెయ్యి కోట్ల అప్పు
డిస్కంలకు రూ.4,741 కోట్ల రుణానికి ఆమోదం
జీఏడీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ కార్పొరేషన్
కేబినెట్ నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి నాని
అమరావతి: రాష్ట్రంలో మగ్గంపై జీవనం సాగిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ‘వైఎస్సార్ నేతన్న పథకం’ పేరుతో ఈ మొత్తం అందిస్తారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారమిక్కడ సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. పీపీఏల సంక్షోభానికి.. గత ప్రభుత్వం అవసరానికి మించి ఒప్పందాలు చేసుకోవడమే కారణమని సమావేశం విమర్శించింది. గత పాలకులు కుదుర్చుకున్న పీపీఏల కారణంగా డిస్కంలు బకాయిల్లో కూరుకుపోయాయని.. వాటి చెల్లింపులకు డిస్కంలు రూ.4,741 కోట్లకు బాండ్లు జారీచేసేందుకు అనుమతిస్తూ నిర్ణ యం తీసుకుంది. రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ బాండ్లను జారీచేస్తుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాలు, రవాణా మం త్రి పేర్నినాని విలేకరులకు వెల్లడించారు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నవంబరు 21వ తేదీ నుంచి దీన్ని అమలుచేస్తారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సమీపంలో గుజరాత్ స్టేట్ పెట్రో కెమికల్ కార్పొరేషన్ చమురు నిల్వల అన్వేషణ కోసం సముద్రంలో చేపట్టిన తవ్వకాల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు అందించే పరిహారాన్ని కూడా అదేరోజు చెల్లిస్తారు. ఈ పరిహారాన్ని గుజరాత్ కార్పొరేషన్ ఇస్తే సరేనని.. లేకుంటే రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌కు లీటరుకు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని, నిర్దేశిత బంకుల్లో డీజిల్ కొట్టించుకున్నప్పుడే ఈ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇసుక ఇబ్బందులపైనా మంత్రివర్గంలో చర్చించామని..అయితే ప్రస్తు తం వరదలు రావడంతో నిస్సహాయత వ్యక్తం చేయ డం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఈ నెలాఖరుకు ఇసు క కొరత తీరే అవకాశాలున్నాయని చెప్పారు.
ఆర్టీసీ లో 3,500పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు కొంతకోత విధించి జీతాలిస్తున్నారని, ఈ ఉద్యోగాల కోసం గతప్రభుత్వంలో అవినీతి కూడా జరిగిందని ఆరోపించారు. వీటికి చెక్ పెట్టేందుకు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆధ్వర్యంలో నెలకొల్పుతామని, వారి జీతాల్లో కోత లేకుండా.. .. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమచేస్తామని తెలిపారు. ‘తుని’ ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యపై విచారణ చేస్తున్నామని, దీనిపై సీరియ్‌సగా ఉన్నామని నాని చెప్పారు.
కేబినెట్ నిర్ణయాలివీ..
రాష్ట్రంలో ప్రజలందరికీ తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు వ్యయ అంచనాలు రూపొందించాలి.
మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
న్యాయ విద్య చదివి…లాయర్‌గా ప్రాక్టీస్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నవారికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లపాటు ప్రోత్సాహకం. డిసెంబరు 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకం అమలు ప్రారంభం.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ, రుణసాయంతో ఆయా వర్గాల యువతకు లారీలు, కార్లు తదితర వాహనాల కొనుగోలుకు ‘ఆదర్శం’ పేరుతో పథకం. ప్రభుత్వానికి అవసరమైన, ఇసుక రవాణాకు అవసరమైన వాహనాలను ఈ లబ్ధిదారులతోనే కొనుగోలు చేయించి.. ప్రభుత్వమే అద్దెకు తీసుకుంటుంది. నెలకు కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చేస్తారు. ఐదేళ్ల తర్వాత రుణం తీరిపోతుంది.
హోం గార్డులకు రోజుకు ఇప్పుడిస్తున్న వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచేందుకు తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
విశ్వవిద్యాలయ పాలకమండళ్ల సభ్యులుగా ఉన్నత విద్యామండలి సభ్యులను కూడా చేర్చాలని నిర్ణయం.
చిరుధాన్యాలు, అపరాల బోర్డు ఏర్పాటు.. ఆయా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు మద్దతు.
పౌర సరఫరాల కార్పొరేషన్ క్రెడిట్ లిమిట్ రూ.2 వేల కోట్లు.
పలాసలో ఏర్పాటు చేసే కిడ్నీ ఆస్పత్రి-రీసెర్చ్ సెంటర్‌కు పోస్టుల మంజూరు.
రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, ప్రతి పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున మిషన్లు కొనడానికి నిధుల మంజూరు.
కృష్ణా జిల్లా కొండపావులూరులో రాష్ట్ర విపత్తుల నియంత్రణ సంస్థకు 39.23 ఎకరాల కేటాయింపు.
రేణిగుంట విమానాశ్రయ విస్తరణకు 17 ఎకరాలు.
పత్రికా ప్రకటనలకు ప్రభుత్వం చెల్లించే టారిఫ్ పెంపు.