సుందర్గడ్ (ఒడిశా): బావిలో పడిన ఏనుగును అటవీశాఖ అధికారులు బయటకు వెలికితీసి రక్షించిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సుందర్గడ్ జిల్లా బిర్తోలా గ్రామంలో వెలుగుచూసింది. ఆహారం కోసం వచ్చిన ఓ ఏనుగు ప్రమాదవశాత్తూ బావిలో పడి ఘీంకారాలు చేస్తుండటంతో అది విన్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వచ్చి చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు అగ్నిమాపకశాఖ అధికారులతో కలిసి వచ్చి ఐదుగంటల పాటు శ్రమించి తాళ్లతో కట్టి బావిలో పడి కొట్టుకుంటున్న ఏనుగును బయటకు లాగి కాపాడారు. బయటకు వచ్చిన ఏనుగు దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. బావిలోనుంచి ఏనుగును వెలికితీసిన ఘటనను వందలాదిమంది గ్రామస్థు వీక్షించారు.
