హైదరాబాద్: తెలంగాణలో 45 వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి నిర్ణయం తదితర అంశాలపై సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా అడుగుతోందని అన్నారు. ఇంధనంపై ఏ రాష్ట్రంలో లేనంత వ్యాట్ తెలంగాణలో ఉందని తెలిపారు. డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ ఛార్జీలను ఆర్టీసీ పెంచలేదని గుర్తుచేశారు. మద్యం, ఇతర వాటిపై వస్తున్న ఆదాయంతో ఆర్టీసీ నష్టాలను పూడ్చాలని కోరారు.