Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 11న రైతు భరోసా జాబితా

11న రైతు భరోసా జాబితా

15న నెల్లూరులో పథకం ప్రారంభం..
ఇప్పటికి 40 లక్షల అర్హులు గుర్తింపు
ఎంతమందికి కౌలుకిచ్చినా.. ఒక్కరికే లబ్ధి
అనర్హులుగా 21 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు
నేడు తాడేపల్లిలో విధివిధానాలు వెల్లడి
అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాను ఈనెల 11న విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏ గ్రామ జాబితాను ఆ గ్రామ సచివాలయంలో ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40లక్షల రైతు కుటుంబాలు, భూమి లేని కౌలు రైతులను అర్హులుగా గుర్తించారు. కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలోప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ప్రధాని మోదీని ఢిల్లీ భేటీలో సీఎం ఆహ్వానించినా, ప్రధాని హాజరయ్యే సంకేతాలేవీ ఇంత వరకూ లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో చిన్న కమతాలు అధికంగా ఉండటం.. కౌలు రైతులు కూడా అత్యధికంగా ఉండటంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సన్నాహక సమావేశాన్ని విజయదశమి నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా కార్యక్రమం విధివిధానాలను మంగళవారం విడుదల చేయనున్నారు.

ఎంతమందికి కౌలుకిచ్చినా.. ఒక్కరికే లబ్ధి
రైతు భరోసా కింద రైతుకు రూ.6500, భూమి లేని కౌలురైతుకు రూ.12,500 రాష్ట్రపభుత్వం రబీ పంటకు పెట్టుబడి సాయంగా ఇవ్వనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం నేరుగా రైతుల ఖాతాలకు రూ.6వేలు జమ చేస్తున్నందున, రైతు భరోసా కింద రూ.6,500 మాత్రమే ఇవ్వనున్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో లబ్ధిదారుల్లో కొందరు అనర్హులున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజాసాధికార సర్వే, ఆధార్‌ సీడింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని, రైతు భరోసాకు అర్హులను గుర్తించాలని నిర్ణయించారు. రైతుభరోసాకు అర్హత కలిగిన భూ యజమానుల్లో లక్షా 7వేల మంది మృతి చెందినట్టు గుర్తించారు. అలాంటి కేసుల్లో పంట సాగు చేస్తున్న చట్టపరమైన వారసులకు ఆ లబ్ధి అందించాలని నిర్ణయించారు.

అలాగే, రాష్ట్రంలో భూమి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 21 లక్షల మంది ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు. ఒక రైతు తన భూమిని ఎంత మందికి కౌలుకు ఇచ్చినా, అందులో ఒక్కరికే ఈ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కౌలురైతులు 15.60 లక్షల మంది అని అంచనా ఉన్నా, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన భూమిలేని కౌలు రైతులు 2లక్షల మంది ఉన్నట్టు గుర్తించారని సమాచారం. వీరు భూయజమానితో కౌలు ఒప్పం దం చేసుకోవాలని, తప్పనిసరిగా పంట సాగుదారుల హక్కు పత్రం(సీసీఆర్‌సీ) తీసుకోవాలని నిబంధన పెట్టారు. దీని ప్రకారం సోమవారం వరకు 40వేల మందికి సీసీఆర్‌సీలు జారీ చేశారు. తుది జాబితా విడుదల చేసేలోగా సీసీఆర్‌సీల జారీ పూర్తి చేయాలని నిర్ణయించారు.

అయితే వెబ్‌ల్యాండ్‌లో పేర్లు లేని వారు, రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ రికార్డుల్లో ఒకే భూమికి వేర్వేరు ఆధార్‌ నంబర్లు అనుసంధానమవడం వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, రైతుభరోసా మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితా తయారు చేస్తున్నారు. రైతుభరోసా కోసం ఇప్పటికే 79,33,782 మంది రైతులు నమోదు చేసుకోగా, అందులో 45,37,231 రైతు కుటుంబాలను అధికారులు గుర్తించారు. 3,143 మంది వివరాలు పరిశీలనలో ఉన్నాయి. కానీ రైతుభరోసా పోర్టల్‌ సమాచారం ప్రకారం రాష్ట్రంలో 66,54,891మంది రైతులు, 47,64,947 రైతు కుటుంబాలను మాత్రమే గుర్తించారు. 6,11,699 మంది సమాచారం అందుబాటులో లేదని అధికారులు తేల్చారు. అటవీహక్కుల చట్టం(ఆర్‌వోఎ్‌ఫఆర్‌) ప్రకారం 61,999 మంది గిరిజన రైతులు ఉన్నారని తేల్చారు.

పేరు లేకపోతే ఫిర్యాదు చేయండి: కన్నబాబు
రైతుభరోసా పథకానికి అర్హత ఉండీ, జాబితాలో పేరు లేకపోతే రాతపూర్వకంగా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సూచించారు. సోమవారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ జాబితాపై ఫిర్యాదుల పరిష్కారానికి త్వరలో గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని చెప్పారు.

16న మంత్రివర్గ సమావేశం..
ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, నవరత్నాల అమలు, ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి భూ సేకరణ తదితర అంశాలపై సమీక్షిస్తారని చెబుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ కార్యదర్శులు, వలంటీర్ల నియామకం, విధులు తదితర అంశాలపైనా మంత్రిమండలి సమీక్షిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *