జైపూర్: ఒక ఆడ పులి కోసం రెండు మగపులుల మధ్య జరిగిన భీకర పోరాట వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్కులోని (టి-57) సింగ్త్, (టి-58) రాఖీ అనే మగపులులు (టి-39) నూర్ అనే ఆడ పులి కోసం భీకరంగా కొట్లాడుకున్నాయి. సింగ్త్, రాఖీ రెండు కూడా ఒకే పులికి జన్మించిన మగపులులని జూ అధికారి పర్వీన్ కస్వాన్ తెలిపారు.
ఈ వీడియో మొదట్లో ఒక మగ పులి ఆడ పులితో ఉండగా రెండవ మగ పులి వాటి వద్దకు వచ్చింది. క్రమంగా రెండు మగపులులు పోరాటం మొదలు పెట్టగానే ఆడ పులి నూర్ అక్కడ నుంచి పరుగు లంకించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచిన ఒక్క రోజులోనే దాదాపు 24 వేల మంది దీనిని వీక్షించారు, వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి. కొందరు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అని కామెంట్లు పెట్టగా సింగ్త్ గెలిచినట్లు జూ అధికారి కస్వాన్ తెలిపారు. ఈ పోరాటంలో రెండు పులులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు.